Sourav Ganguly: ఆ ప్లేయర్‌ని నేను అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా భావిస్తున్నా: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly said that Rishabh Pant to become an all time great in Test cricket


టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పరిగణిస్తున్నట్టు మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. పంత్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, అతడు టెస్టుల్లో భారత్‌కు ఆడుతూనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా రిషబ్ పంత్ ఎదగాలని అన్నాడు.

టెస్టు క్రికెట్‌లో రాణిస్తూనే పరిమితి ఓవర్ల క్రికెట్‌లో కూడా తన ఆటను మెరుగుపరుచుకోవాలని గంగూలీ సూచించాడు. పంత్ తనను తాను మెరుగుపరచుకుంటే అత్యుత్తమంగా మారతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘‘టెస్టుల్లో ఈ విధంగా పంత్ రాణిస్తే ఆల్‌టైమ్ గ్రేట్ అవుతాడు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో కూడా మెరుగవ్వాలి. అతడికి ఉన్న ప్రతిభతో అత్యుత్తమ ఆటగాడిగా మారతాడని నేను నమ్ముతున్నాను’’ కోల్‌కతాలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న మహ్మద్ షమీ బంగ్లాదేశ్ సిరీస్‌లో అందుబాటులో లేడు కదా అని ప్రశ్నించగా.. ఎలాంటి ఇబ్బంది ఉండదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. చెన్నై పిచ్ స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదని విశ్లేషించాడు.

 ‘‘అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లు. ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి స్పిన్నర్లు రాణిస్తారు’’ అని గంగూలీ విశ్లేషించాడు. కాగా గాయం కారణంగా దూరమైన షమీ భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే సమయానికి తిరిగి జట్టులోకి రావాలని పేర్కొన్నాడు. 

కాగా సెప్టెంబరు 19న బంగ్లాదేశ్‌తో మొదలు కానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పంత్ ఆడనున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత టెస్టు ఫార్మాట్ క్రికెట్‌లో అతడికి ఇదే పునరాగమనం కానుంది. చివరిసారి డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌పై టెస్ట్ సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది.

  • Loading...

More Telugu News