YSRCP: ఆ బోట్లు టీడీపీ వాళ్లవే: వైసీపీ
- నిందితుల్లో ఒకరైన కోమటి రామ్మోహన్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధిపతి కోమటి జయరాంకు బంధువు అని పేర్కొన్న వైసీపీ
- మరో నిందితుడు ఉషాద్రి టీడీపీ వ్యక్తే, లోకేశ్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉన్నాయన్న వైసీపీ
- మీ డ్రామా మొత్తం రివర్స్ అయిందంటూ వైసీపీ కౌంటర్ ట్వీట్
ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైసీపీ వారే కుట్ర పూరితంగా కృష్ణానదిలోకి ఐదు బోట్లు వదిలారని సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ స్పందిస్తూ ఆ బోట్లు టీడీపీ వారివేనని పేర్కొంది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు టీడీపీ నేతలకు సంబంధించిన వారేనని పేర్కొంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
నిందితుల్లో ఒకరైన కోమటి రామ్మోహన్ .. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధిపతి కోమటి జయరామ్‌కు బంధువు అని వైసీపీ పేర్కొంది. ఇక రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తేనని, అతను నారా లోకేశ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయని చెప్పింది. ఆ బోట్లు నడిపింది కూడా అతనేనని చెప్పింది. కోమటి రామ్మోహన్ మైలవరం టీడీపీ టికెట్ ఆశించిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుకి అత్యంత సమీప బంధువు అనే విషయం బయటపడే సరికి మీ డ్రామా మొత్తం రివర్స్ అయిపోయిందని విమర్శించింది.
చంద్రబాబు, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావుతో కోమటి రామ్మోహన్ కి ఎంత సాన్నిహిత్యం ఉందో ఈ ఫోటోలను చూస్తేనే అర్ధం అవుతుందని వైసీపీ పేర్కొంది. అడ్డంగా దొరికిపోయాక ఇంకెందుకు ఈ బుకాయింపులు? అని ప్రశ్నించింది. నిన్న టీడీపీ చేసిన ట్వీట్‌కు రిప్లైగా వైసీపీ కౌంటర్ ఇస్తూ టీడీపీ నేతలతో నిందితుడు ఉన్న ఫోటోలను షేర్ చేసింది.