RG kar Doctors: సుప్రీంకోర్టు ఆదేశాలపై కోల్ కతా వైద్యుల అసంతృప్తి
- ఆందోళనలు ఆపబోమని స్పష్టం చేసిన వైద్యులు
- ఆర్జీ కర్ వైద్యురాలి మరణంపై ఇది ప్రజల ఉద్యమమని వెల్లడి
- నేటి సాయంత్రంలోగా విధుల్లో చేరాలంటూ వైద్యులకు సుప్రీం వార్నింగ్
కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేటి (మంగళవారం) సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని, లేకుంటే బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవచ్చని సీజేఐ ధర్మాసనం డెడ్ లైన్ విధించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తోటి వైద్యురాలికి జరిగిన దారుణానికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళనల నుంచి వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. తమది ప్రజాందోళన అనేది ఇటు ప్రభుత్వం కానీ, అటు సుప్రీంకోర్టు కానీ విస్మరించలేదని అన్నారు. ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచారం కేసు కలకత్తా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి మారిందని గుర్తుచేస్తూ.. అయినా కూడా న్యాయం మాత్రం ఇప్పటికీ జరగలేదని జూనియర్ డాక్టర్ల ప్రతినిధి వాపోయారు.
సోమవారం కేసు విచారణ సందర్భంగా.. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించడంతో ఇప్పటి వరకు 23 మంది రోగులు వైద్యం అందక చనిపోయారని, సుమారు 60 వేల మంది రోగులకు చికిత్స అందలేదని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. దీంతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. అప్పటికీ విధుల్లోకి చేరని జూడాలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం బెంగాల్ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. తమ ఆందోళనల వల్ల రాష్ట్రంలో హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలిందనే ప్రచారంలో వాస్తవంలేదన్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ముందు తాము ఆందోళన చేస్తున్నామని, అదేచోట అభయ క్లినిక్ తెరిచి రోగులకు సేవలందిస్తున్నామని గుర్తుచేశారు. కాగా, ఆందోళన కొనసాగించాలన్న జూనియర్ డాక్టర్ల నిర్ణయానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పశ్చిమ బెంగాల్ మద్దతు తెలిపింది.