Australia: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం!
- సోషల్ మీడియా వినియోగం పిల్లలను తప్పుదోవ పట్టిస్తోందంటున్న ఆస్ట్రేలియా
- ఈ నేపథ్యంలోనే వారిపై బ్యాన్ విధిస్తూ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటన
- సోషల్ మీడియా వినియోగానికి పిల్లల కనీస వయస్సు 16 ఏళ్లుగా నిర్ణయించే దిశగా ప్రభుత్వం
- ఈ ఏడాదే ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెడతామన్న ప్రధాని
సోషల్ మీడియా వినియోగం పిల్లలను తప్పుదోవ పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం ప్రకటించారు.
సోషల్ మీడియా, ఇతర సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును అమలు చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెడుతుందని ప్రధాని పేర్కొన్నట్లు జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది.
"సోషల్ మీడియా సామాజిక హాని కలిగిస్తోందని మాకు తెలుసు. ఇది పిల్లలను నిజమైన స్నేహితులు, నిజమైన అనుభవాల నుండి దూరం చేస్తోంది" అని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రాలతో చర్చల అనంతరం ప్రత్యేక చట్టంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగానికి పిల్లల కనీస వయస్సు 16 ఏళ్లుగా నిర్ణయించడమే తన అభిమతమని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.
ఇక ఆగస్టులో స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నిర్వహించిన పోల్ ప్రకారం, 61 శాతం మంది ఆస్ట్రేలియన్లు 17 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి సోషల్ మీడియా యాక్సెస్‌ను పరిమితం చేయడాన్ని సమర్థించడం గమనార్హం.
అదే సమయంలో దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ పీటర్ మలినాస్కాస్, 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేధించడానికి చట్టపరమైన మార్గాల అన్వేషణకు మాజీ ఫెడరల్ జడ్జి రాబర్ట్ ఫ్రెంచ్ను నియమించారు.
ఇక త్వరలో చట్టాన్ని రూపొందించేటప్పుడు ఫెడరల్ ప్రభుత్వం రాబర్ట్ ఫ్రెంచ్ సమీక్షను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు.