Danam Nagender: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు... స్పందించిన దానం నాగేందర్
- తమపై అనర్హత వేటు పడుతుందని మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్న దానం
- వారు చేస్తే నీతి... వేరేవాళ్లు చేస్తే అవినీతి అన్నట్లుగా వారి వైఖరి ఉందని ఆగ్రహం
- బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన తప్ప చేసిందేమీ లేదని విమర్శ
తమపై అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, కానీ వారికి అలా మాట్లాడే నైతిక హక్కు లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందిస్తూ... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ తీర్పుతో శునకానందం పొందుతున్నాయని విమర్శించారు.
తాము చేస్తే నీతి... వేరేవాళ్లు చేస్తే అవినీతి అన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన వారిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలన్నారు. కుటుంబ పాలన తప్ప వారు చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యేలను బానిసలుగా చూశారని మండిపడ్డారు.
నా ముందు బచ్చాగాళ్లు కూడా ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు అంటూ దానం ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీలో విలువ ఇవ్వలేదని, చీడ పురుగుల్లా చూశారని విమర్శించారు.
ఇక, బీజేపీ జాతీయస్థాయిలో ఏం చేస్తుందో చూడాలన్నారు. పంజాబ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై లీగల్ సలహాలు తీసుకుంటున్నామని, తీర్పుపై మాత్రం స్పందించనన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్‌కు ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని, లేదంటే సుమోటోగా విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.