Steve Smith: ఆ విషయంలో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియనే: స్టీవ్ స్మిత్
- మైదానంలో కోహ్లీ ఆలోచనలు, చేతలు ఆస్ట్రేలియన్ను గుర్తు చేస్తాయన్న స్మిత్
- అందుకే తాను విరాట్‌ను ఆస్ట్రేలియన్‌గా భావిస్తానని వ్యాఖ్య
- కోహ్లీ గొప్ప వ్యక్తి, అద్భుతమైన ఆటగాడంటూ కితాబు
- తామిద్దరం కలిసిన ప్రతిసారీ మంచి విషయాలను పంచుకుంటామన్న ఆసీస్ స్టార్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో విరాట్ ఆలోచనలు, చేతలు ఆస్ట్రేలియన్ మాదిరి ఉంటాయని పేర్కొన్నాడు. అందుకే తాను భారత బ్యాటింగ్ దిగ్గజాన్ని ఆస్ట్రేలియన్‌గా భావిస్తానని అన్నాడు.
"ఆలోచనలు, చర్యలలో విరాట్ కోహ్లి ఆస్ట్రేలియన్ అని నేను నమ్ముతున్నాను. అతను మ్యాచ్‌లో ఆడే విధానం, సవాలును ఎదుర్కొనే తీరు, ప్రత్యర్థిని అధిగమించడానికి ప్రయత్నించే విధానం.. ఇలా ప్రతి విషయంలో అతను భారతీయ ఆటగాళ్లలో ఆస్ట్రేలియన్ను గుర్తు చేస్తాడు. అందుకే కోహ్లీ ఆటను నేను ఇష్టపడతాను. మీరు కాదంటారా చెప్పండి" అని స్మిత్ 'ఎక్స్' (ట్విట్టర్) లో స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
"అసలు విరాట్‌ను అధిగమించాలని ఎప్పుడూ అనుకోను. కేవలం నా ఆటపై మాత్రమే దృష్టిపెడతాను. చేయగలిగినన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. తద్వారా ఆస్ట్రేలియాకు విజయం సాధించడంలో సహాయపడటం గురించి మాత్రమే ఆలోచిస్తాను" అని స్మిత్ అన్నాడు.
"మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. కలిసిన ప్రతిసారీ మంచి విషయాలను పంచుకుంటాం. అతను గొప్ప వ్యక్తి. అలాగే అద్భుతమైన ఆటగాడు కూడా. ఈ వేసవిలో మళ్లీ కోహ్లీతో కలిసి ఆడడం ఆనందంగా ఉంటుంది" అని స్మిత్ చెప్పుకొచ్చాడు.
29 టెస్టు సెంచరీలు సహా 80 అంతర్జాతీయ శతకాలు సాధించిన కోహ్లీ.. 113 టెస్టుల్లో 49.16 సగటుతో 8,846 పరుగులు చేశాడు. ఇక స్టీవ్ స్మిత్ 109 టెస్టుల్లో 56.97 సగటుతో 32 సెంచరీలతో 9,685 పరుగులు చేశాడు.
నవంబర్ 22 నుండి 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్ (పింక్-బాల్ గేమ్-డే/నైట్ టెస్టు), బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ వేదికల్లో ఇరు దేశాలు ఆడనున్నాయి.
కాగా, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి రెండు ఎడిషన్లను వరుసగా టీమిండియానే గెలుచుకుంది. దీంతో ఇప్పుడు జరగబోయే సిరీస్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.