Rohit Sharma: 'ముంబైతో రోహిత్ ప్రయాణం ముగిసింది'.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- గతేడాది రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన ముంబై ఇండియన్స్
- అప్పటి నుంచి ఆ జట్టులో హిట్‌మ్యాన్ భవితవ్యంపై చర్చ
- 2025 ఐపీఎల్ మెగా వేలం ఉండడంతో తారస్థాయికి చేరిన చర్చలు
- ఈ క్రమంలో ఈ మాజీ కెప్టెన్‌ను ఈసారి ఎంఐ రిటైన్ చేసుకోదన్న ఆకాశ్ చోప్రా
- రోహిత్‌కూ ఆ జట్టులో కొనసాగడం ఇష్టంలేదన్న భారత మాజీ క్రికెటర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ (ఎంఐ) తో రోహిత్ శర్మకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదుసార్లు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన ఘనత హిట్‌మ్యాన్‌ది. అయితే, గతేడాది ఎంఐ యాజమాన్యం అనూహ్యంగా రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబైలో ఈ స్టార్ ప్లేయర్ భవితవ్యంపై చర్చ మొదలైంది. వచ్చే ఏడాది మెగా వేలం ఉండడంతో ఈ చర్చలు తారస్థాయికి చేరాయి. హిట్‌మ్యాన్ ఎంఐలో కొనసాగుతాడా ఫ్రాంచైజీ అతడిని వదిలేస్తుందా రోహిత్ వేరే జట్టుకు వెళ్లిపోతాడా అనే పలు ప్రశ్నలు అభిమానులను తొలచివేస్తున్నాయి.
ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ముంబైలో రోహిత్ శర్మ కొనసాగడంపై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎంఐతో హిట్‌మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని చెప్పాడు. ఈ మాజీ కెప్టెన్‌ను ఈసారి ఎంఐ రిటైన్ చేసుకోదని పేర్కొన్నాడు.
రోహిత్‌కూ ఆ జట్టులో కొనసాగడం ఇష్టంలేదని చెప్పాడు. ఫ్రాంచైజీ అతడిని విడుదల చేయవచ్చని తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో ముంబైలో రోహిత్ భవితవ్యంపై చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.
"అతను ముంబైలో ఉంటాడా లేక వెళ్తాడా? ఇది పెద్ద ప్రశ్న. వ్యక్తిగతంగా నాకు తెలిసి అతను ఉండడని భావిస్తున్నాను. మీ పేరు ఎంఎస్ ధోని అయితే.. తప్పకుండా మిమ్మల్ని రిటైన్ చేసుకుంటారని చెప్పొచ్చు. ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ కథ చాలా భిన్నమైంది. కానీ ఎంఐ పరిస్థితి వేరు. ఇక్కడ స్వయంగా రోహిత్ శర్మ వెళ్లిపోవచ్చు, లేదా ముంబై అతనిని విడిచిపెట్టవచ్చని భావిస్తున్నాను" అని చోప్రా అభిప్రాయపడ్డాడు.
"ఏదైనా జరగవచ్చు కానీ, రోహిత్ ముంబైతో ఉంటాడని మాత్రం నేను అనుకోను. నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. కానీ రోహిత్ బహుశా విడుదల అవుతాడని నేను భావిస్తున్నాను. వేలంలో ఏ జట్టు అయినా అతడిని కొనుగోలు చేయవచ్చు. ముంబై ఇండియన్స్‌తో అతని ప్రయాణం ముగిసిందని నేను భావిస్తున్నాను" అని భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో సూర్య కుమార్ యాదవ్‌ను ముంబై వదిలేస్తుందా అనే ప్రశ్నకు ఆకాశ్ చోప్రా భిన్నంగా స్పందించాడు. సూర్యను ఆ ఫ్రాంచైజీ ఇప్పట్లో వదులుకోదని తెలిపాడు.
"మీరు ఏమి అడుగుతున్నారు? సూర్యకుమార్ యాదవ్‌ని ఆ జట్టు వదిలేయడం ఇప్పట్లో జరగదు. అలాగే సూర్య కూడా ముంబైని వదిలిపెట్టడు. ఆ జట్టుతోనే కొనసాడుతాడు" అని చోప్రా చెప్పాడు.