Arun Ramachandran Pillai: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరికి బెయిల్
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై
- కవితకు సన్నిహితుడిగా ముద్రపడ్డ పిళ్లై
- గతేడాది కవిత అరెస్ట్ కు కొన్ని రోజుల ముందు పిళ్లై అరెస్ట్
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరికి బెయిల్ లభించింది. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు కావడం తెలిసిందే. తాజాగా, అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ నమోదు చేసిన కేసులో రామచంద్రన్ పిళ్లైకి బెయిల్ లభించింది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. పిళ్లై... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడని, లిక్కర్ స్కాంలో కవిత ప్రయోజనాల కోసం పిళ్లై పనిచేశాడని అభియోగాలు మోపారు.
ఈ వ్యవహారంలో పిళ్లై ఇండోస్పిరిట్ లిక్కర్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి లంచాలు స్వీకరించి, ఆ లంచాలను ఈ కేసులో ఇతర నిందితులకు అందించాడన్నది అతడిపై ఉన్న ప్రధాన అభియోగం.
కాగా, విచారణ సమయంలో పిళ్లై తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని, సాక్ష్యాధారాలను నాశనయం చేయడంలో అతడి పాత్ర కూడా ఉందని ఈడీ ఆరోపిస్తోంది. పిళ్లైని ఈడీ గతేడాది మార్చిలో అరెస్ట్ చేసింది. పిళ్లైని అరెస్ట్ చేసిన కొన్ని రోజులకే కవితను అరెస్ట్ చేయడం గమనార్హం.