Gaza: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం... శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు పడుతుందట!
- గాజా యుద్ధం.. 80వేల ఇళ్ల ధ్వంసం, రూ. 1.53లక్షల కోట్ల మేర నష్టం
- 4 కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయినట్లు తెలిపిన యూఎన్ఓ
- గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాల సమయం పడుతుందని అంచనా
- 41వేలకు పైగా పాలస్తీనియన్ల మృతి
- శిథిలాల కింద మరో 10వేల మృతదేహాలు
2024 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపు దాడికి ప్రతీకారంగా గాజా నగరాలపై ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడ్డాయి. దీంతో గాజా నగరాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ విధ్వంసంలో ఇప్పటివరకు దాదాపు 80వేల ఇళ్లు ధ్వంసం కాగా, వీటిని పునర్నిర్మించాలంటే బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందని తాజాగా ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) అంచనా వేసింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 4 కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయినట్లు యూఎన్ఓ పేర్కొంది. వీటిని తొలగించేందుకు ఏకంగా 15 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. అలాగే 50 నుంచి 60 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని తెలిపింది.
యూఎన్ఓ రిపోర్ట్ ప్రకారం గాజా పునర్నిర్మాణానికి 2040 వరకు లేదా మరిన్ని దశాబ్దాల సమయం పడుతుందని అంచనా వేసింది. ఈ యుద్ధంలో గాజాలో 80వేల ఇళ్లు ధ్వంసమైనట్లు గాజా అధికారులు తెలిపారు. 18.5 బిలియన్ డాలర్ల (రూ. 1.53లక్షల కోట్ల) మేర ఆస్తి నష్టం జరిగింది.
అలాగే 41వేలకు పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. 95వేల మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరో 10వేల మృతదేహాలు ఉండొచ్చని అంచనా. ఇక అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు.