IPL 2025 Mega Auction: వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురు వికెట్ కీపర్ల పంట పండనుందా?.. వారి కోసం కోట్లు గుమ్మరించేందుకు రెడీ అవుతున్న ఫ్రాంచైజీలు!
- 2025లో ఐపీఎల్ మెగా వేలం
- ఇప్పటి నుంచే ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పుపై కసరత్తులు
- బ్యాట్‌తో పాటు స్టంప్‌ల వెనుక చురుకుగా ఉండే వికెట్ కీపర్ల కోసం జట్ల వెతుకులాట
- వికెట్ కీపర్లు రిషభ్ పంత్ , ధృవ్ జురెల్, జితేష్ శర్మకు భారీ ధర పలికే అవకాశం
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. దీంతో ఇప్పటి నుంచే ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పుపై కసరత్తు మొదలుపెట్టాయి. జట్టులో ఎంతమంది ఆల్‌రౌండర్లు, బౌలర్లు, బ్యాటర్లు, కీపర్లు ఉండాలి, ఎవరిని తీసుకుంటే టీమ్ బలంగా ఉంటుంది తదితర విషయాలపై మెంటార్లు, హెడ్ కోచ్‌లతో చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాట్‌తో పాటు స్టంప్‌ల వెనుక చురుకుగా ఉండే వికెట్ కీపర్ల కోసం వెతుకుతున్నట్లు సమాచారం.
దీంతో ప్రస్తుతం టాప్‌లో ఉన్న టీమిండియా వికెట్ కీపర్లు రిషభ్ పంత్ , ధృవ్ జురెల్, జితేష్ శర్మ ముగ్గురికి బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉందట. వీరి కోసం వచ్చే వేలంలో రికార్డు స్థాయి ధరలు చెల్లించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి ఈ ముగ్గురు రికార్డు ధరలకు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని అధికారిక వర్గాల సమాచారం.
రిషభ్ పంత్: ది డైనమిక్ ఫోర్స్
రిషభ్ పంత్ ఇప్పటికే ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత డైనమిక్ వికెట్ కీపర్, బ్యాటర్లలో ఒకడిగా స్థిరపడ్డాడు. అతని దూకుడు బ్యాటింగ్ శైలి, వికెట్ కీపింగ్ నైపుణ్యాలు జట్టుకు బాగా కలిసొచ్చే అంశాలు. ఒంటి చేతితో మ్యాచ్ ను సులువుగా గెలిపించగల సమర్థత కలిగిన ఆటగాడు. అందుకే ఈ సారి పంత్ మెగా వేలంలో భారీ ధర పలకనున్నట్లు సమాచారం.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ధోనీ వారసుడి కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు పంత్ ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను విడిచిపెడితే భారీ ధర పలకడం ఖాయమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
ధృవ్ జురెల్: ది ఎమర్జింగ్ టాలెంట్
యువ ఆటగాడు ధృవ్ జురెల్ గత ఐపీఎల్ సీజన్లో దూకుడైన ఆట తీరుతో తానేంటో నిరూపించుకున్నాడు. అలాగే దేశవాళీ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో జురెల్ చాలా బాగా ఆడగలడు. అతని బ్యాటింగ్‌లో మంచి టెక్నిక్ ఉంటుంది. క్రీజులో నిలదొక్కుకుంటే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం అతని సొంతం. టాప్ లేదా మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం జురెల్ కు ఉంది.
అలాగే వికెట్ కీపింగ్ కూడా బాగా చేయగలడు. టాప్ లేదా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న ఫ్రాంచైజీల మధ్య బిడ్డింగ్ సమయంలో జురెల్ కోసం పోటీ ఉండే అవకాశం ఉంది. అందుకే అతను ఈ ఏడాది జరిగే ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జితేశ్ శర్మ: పవర్ హిట్టర్
జితేశ్ శర్మ ఐపీఎల్లో పవర్ హిట్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. డెత్ ఓవర్లలో జితేశ్ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తాడు. బౌండరీలను సులభంగా క్లియర్ చేయగల అతని సామర్థ్యం డెత్ ఓవర్లకు అతన్ని సరిగ్గా సరిపోయేలా చేస్తుంది. అలాగే వికెట్ కీపింగ్ కూడా సమర్థవంతంగా చేయగలడు. పంజాబ్ కింగ్స్ వంటి జట్లు తమ మిడిల్ ఆర్డర్ కష్టాలకు చెక్ పెట్టేందుకు జితేశ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ యంగ్ ప్లేయర్ కూడా 2025లో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.
ఇలా ఈసారి వేలంలో ఈ ముగ్గురు వికెట్ కీపర్ల పంట పండటం ఖాయమని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్రాంచైజీలు వీరి కోసం రికార్డు స్థాయి ధరలు చెల్లించేందుకు వెనుకాడకపోవచ్చని తెలుస్తోంది.