Arekapudi Gandhi: నేను ఆంధ్రావాడినా?.. బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి: అరికెపూడి గాంధీ
- ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గాంధీ డిమాండ్
- పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలన్న ఎమ్మెల్యే
- కౌశిక్‌రెడ్డి భార్య కూడా తన అనుచరులపై దాడి చేశారని ఆరోపణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం నిన్న తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. చివరికి అరెస్ట్‌లకు దారితీసింది. తాజాగా, ఈ విషయమై స్పందించిన గాంధీ.. తనను ఆంధ్రావాడిగా పేర్కొన్న కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కనుక బాధ్యత వహిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడంతోపాటు పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని గాంధీ డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డి ఆహ్వానిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్లానని తెలిపారు. అక్కడ తన అనుచరులపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడిచేశారని, కౌశిక్‌రెడ్డి భార్య స్వయంగా పై నుంచి పూలకుండీలు విసిరారని గాంధీ ఆరోపించారు.