Hamza bin Laden: బిన్ లాడెన్ కొడుకు బతికే ఉన్నాడా?... సంచలన విషయం వెలుగులోకి!
- ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడన్న ‘ది మిర్రర్’ కథనం
- 450 మంది స్నైపర్లు అతడికి నిరంతరం భద్రత ఇస్తున్నారని వెల్లడి
- 2019లో అమెరికా వైమానిక దాడిలో మరణించినట్టు గతంలో వెలువడిన కథనాలు
అమెరికా వైమానిక దాడిలో 2019లో చనిపోయాడని భావించిన ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ సజీవంగా ఉన్నాడని ‘ది మిర్రర్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. అతడు ఉగ్ర సంస్థ అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలిసిందని పేర్కొంది.
హమ్జా తన సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్‌తో కలిసి ఆఫ్ఘనిస్థాన్‌లో ఉండి అల్ ఖైదాను రహస్యంగా నిర్వహిస్తున్నాడని పేర్కొంది. ఎన్ఎంఎఫ్ (నేషనల్ మొబిలైజేషన్ ఫ్రంట్) అనే తాలిబాన్ వ్యతిరేక మిలిటరీ కూటమి కూడా హమ్జా, అతడి అనుచరులు నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. హమ్జాను ‘ఉగ్రవాద యువరాజు’గా అభివర్ణించింది. అతడు ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో దాక్కున్నాడని, ఏకంగా 450 మంది స్నైపర్లు అతడికి నిరంతరం రక్షణ ఇస్తున్నారని తెలిపింది.
2021లో ఆఫ్ఘనిస్థాన్ పతనం తర్వాత ఆ దేశం వివిధ ఉగ్రవాద గ్రూపులకు ట్రైనింగ్ సెంటర్‌గా మారిందని ఎన్ఎంఎఫ్ నివేదిక అప్రమత్తం చేసింది. ‘‘హమ్జా బిన్ లాడెన్‌ను దారా అబ్దుల్లా ఖేల్ జిల్లాకు తరలించారు. అక్కడ 450 మంది అరబ్బులు, పాకిస్థానీలు అతడికి రక్షణ కల్పిస్తున్నారు. అతడి ఆధ్వర్యంలో అల్ ఖైదా మళ్లీ రూపు దిద్దుకుంటోంది. భవిష్యత్‌లో పాశ్చాత్య దేశాల లక్ష్యాలపై దాడులకు సిద్ధమవుతోంది’’ అని పేర్కొంది.
ఒసామా బిన్ లాడెన్ హత్య తర్వాత అల్ ఖైదా బాధ్యతలు చేపట్టిన అల్-జవహిరితో హమ్జా సన్నిహితంగా కార్యకలాపాలు కొనసాగించినట్టు భావిస్తున్నట్టు పేర్కొంది.
కాగా 2019లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో హమ్జా మరణించాడని అంతా భావించారు. అమెరికా, ఇతర దేశాలపై దాడులు చేస్తామంటూ అతడు ఆడియో, వీడియో సందేశాలు విడుదల చేసిన కొంతకాలం తర్వాత హత్య వార్తలు వెలువడ్డాయి. అయితే మరణించిన ప్రదేశం, తేదీ అస్పష్టంగా ఉన్నాయని బీబీసీ కథనం పేర్కొంది. అమెరికా రక్షణశాఖ పెంటగాన్ కూడా ఈ అంశంపై స్పందించలేదు. కాగా హమ్జా బిన్ లాడెన్‌ను అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. ఇరాన్లో గృహ నిర్బంధంలో ఉన్నట్లు భావిస్తున్నట్టు గతంలో ప్రకటించింది.
ఇదిలావుంచితే హమ్జా తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా భద్రతా బలగాలు అంతమొందించాయి. ఓ కాంపౌండ్‌లో తలదాచుకుంటున్న అతడిని అమెరికా ప్రత్యేక దళాలు హతమార్చాయి. 2001 సెప్టెంబర్ 11 న అమెరికాలో ఉగ్రదాడులకు పాల్పడి 3,000 మంది అమాయుల మరణానికి అతడు కారణమైన విషయం తెలిసిందే.