KTR: ఒక్క సీటు కూడా గెలవలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగబట్టారు: కేటీఆర్
- రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన సీఎం అంటూ కేటీఆర్ ఆగ్రహం
- హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం గట్టారన్న కేటీఆర్
- హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపాటు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలపై పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండాపూర్‌లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్, తెలంగాణ పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం గట్టారన్నారు.
అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో కొత్త పంచాయతీని తీసుకువచ్చారని విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు... కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆయన పగబట్టి కొత్త పంచాయతీలు తీసుకువచ్చారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా మావాళ్లేనని మరోసారి చెబుతున్నామని, ఇదే విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రాంతీయతత్వం లేదా ప్రాంతీయ భేదం లేవన్నారు.
కౌశిక్ రెడ్డి అసలు ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరామన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచాలని కోరుతున్నామన్నారు. పార్టీ మారిన వారికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. తాను పార్టీ మారానని అరికెపూడి గాంధీ ఇదివరకు బహిరంగంగా ప్రకటించారని, అలాంటి ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తే దాడి చేయడమేమిటన్నారు.
కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? హైదరాబాద్‌లో శాంతిభద్రతలను అదుపు చేయలేకపోతున్నారని విమర్శించారు. గూండాలకు పోలీస్ రక్షణను ఇచ్చి మరీ కౌశిక్ రెడ్డి మీదకు దాడికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్లు చేసినా... ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.