Arvind Kejriwal: కేజ్రీవాల్ విడుదల సందర్భంగా టపాసులు పేల్చిన అభిమానులు... కేసు నమోదు
- నిన్న రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్
- బాణసంచాతో స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు
- ఢిల్లీలో బాణసంచా వినియోగంపై నిషేధం
- కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్ రావడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు. అయితే ఢిల్లీలో బాణసంచా వినియోగంపై నిషేధం ఉన్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. నిన్న సీబీఐ కేసులో బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక... ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద, అలాగే పలు ప్రాంతాల్లో కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో బీఎన్ఎస్ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ లక్ష్యంగా బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు గత సోమవారం నాడు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆన్ లైన్ విక్రయాలు, డెలివరీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.