Pawan Kalyan: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందన
- హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు ప్రకటన
- వలసపాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరు మార్పు నిర్ణయంపై కేంద్రానికి ప్రశంస
- వలస వారసత్వం ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షిస్తుందంటూ వ్యాఖ్య
బ్రిటీష్ వలస పాలన నాటి పేర్లను మార్చే క్రమంలో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఈ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని పవన్ ప్రకటించారు.
శతాబ్దాల పాటు దేశాన్ని అణచివేసిన వలసపాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్పాలనే నిర్ణయం భారత్ సాధించిన విజయాలను మరింత గౌరవింప చేస్తుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇది ప్రశంసనీయమైన చర్య అని కొనియాడారు. వలస వారసత్వం ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తాను నమ్ముతున్నట్టు పవన్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.