Arekapudi Gandhi: అరెకపూడి ఇంటిని బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే అవకాశం... 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు
- గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్
- ఇటీవల కౌశిక్‌రెడ్డి-గాంధీ మధ్య సవాళ్ల పర్వం
- తాజాగా గాంధీ ఇంటికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తారన్న సమాచారం
- అరెకపూడి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 200 మంది పోలీసులు అప్రమత్తంగా ఉండి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గాంధీని పీఏసీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.
విపక్షాలకు దక్కాల్సిన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని అరెకపూడికి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి ఇంటికి గాంధీ తన అనుచరులతో వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాజాగా, గాంధీ ఇంటికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు రానున్నారన్న సమాచారంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు.