Ponnam Prabhakar: పరిపాలన మీకు మాత్రమే తెలుసని అనుకోవద్దు: కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ విమర్శలు
- రేపు కరీంనగర్ లో గణేశ్ నిమజ్జనం
- మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం
- శాంతిభద్రతలు ఉండరాదని కేటీఆర్ కోరుకుంటున్నారా అంటూ ఫైర్
- గత పదేళ్లలో ఏం జరిగిందో మాకు తెలియదా అంటూ వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ శాంతిభద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో శాంతిభద్రతలు ఉండకూడదని కేటీఆర్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
గత పదేళ్లలో ఏం జరిగిందో మాకు తెలియదా? తెలంగాణలో శాంతిభద్రతలపై ఏంచేయాలో మాకు తెలుసు... పరిపాలనా సామర్థ్యం మీకు మాత్రమే ఉందని అనుకోవద్దు... మీకంటే మెరుగ్గా పాలించే సత్తా మాకుంది అని స్పష్టం చేశారు.
హైదరాబాదులో గణేశ్ మహా నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, సంతృప్తికర వాతావరణంలో నిమజ్జనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిమజ్జనం రోజున సచివాలయం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. గతంలో నిమజ్జనం రోజున సచివాలయం మూతపడేదని, నిమజ్జనం వేళ బీఆర్ఎస్ వాళ్ల గురించి మాట్లాడడం కూడా అనవసరం అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఏదైనా ఉంటే... గణేశ్ నిమజ్జనం తర్వాత చూసుకుందామని విపక్షాలకు తేల్చి చెప్పారు. 18వ తేదీ వరకు రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉందామని పిలుపునిచ్చారు. గణేశ్ నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని, అప్పటివరకు సంయమనంతో ఉందామని అన్నారు.
రేపు (సెప్టెంబరు 16) కరీంనగర్ లో గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో, మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పరిశీలించారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.