Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన
- రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కదలిక దృశ్యాలు
- భయాందోళనలకు గురవుతున్న స్థానికులు
- చిరుతను ట్రాప్ బోనులో బంధించేందుకు ముమ్మరంగా యత్నిస్తున్న అటవీ శాఖ అధికారులు
రాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుత సంచారం కలకలాన్ని సృష్టిస్తోంది. తాజాగా రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కదలిక చిత్రాలు కనిపించాయి. దీంతో చిరుత ప్రస్తుతం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిరుతని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
చిరుతను కచ్చితంగా పట్టుకుంటామని ఫారెస్టు అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ, ఆటోనగర్ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఏరియాలలో పిల్లలను తల్లిదండ్రులు సాయంత్రం 6 గంటల తర్వాత బయట తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ కాలేదని అంటున్నారు. చిరుత కదలికలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.