Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు
- గుజరాత్ లోని గాంధీ నగర్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు
- హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు
- ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలు అవసరమన్న చంద్రబాబు
గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఇవాళ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
గుజరాత్ లో ఇవాళ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరై, ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తిసామర్థ్యాల గురించి వివరించానని వెల్లడించారు.
భిన్న రకాల వాతావరణాలను తట్టుకునేలా మన ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలను రూపొందించడం అత్యావశ్యకం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసం... శక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరం అని పేర్కొన్నారు. ఈ కోణంలోనే, 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు.
ప్రజా శ్రేయస్సు కోసం సాంకేతికత అంశంలో ఏపీ అగ్రగామిగా ఉందని, ఇప్పుడు ఇంధన రంగం వంతు అని చంద్రబాబు స్పష్టం చేశారు.