World Record: ఒకేరోజు 13,326 గ్రామసభలతో ప్రపంచ రికార్డుకెక్కిన ఏపీ
- ఆగస్టు 23న 'స్వర్ణ గ్రామ పంచాయతీ' పేరిట రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు
- గ్రామసభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు
- స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందన్న జనసేనాని
- హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ధృవపత్రాన్ని అందజేసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్
ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డుకెక్కింది. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. సంబంధిత అధికారులు రికార్డు ధృవపత్రాన్ని తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా జనసేనాని బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఈ ప్రపంచ రికార్డు నమోదు కావడం గమనార్హం.
చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు
ఈ సందర్భంగా గ్రామసభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గత నెల 23న 'స్వర్ణ గ్రామ పంచాయతీ' పేరిట రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించడంలో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు, ప్రతినిధులకు పవన్ అభినందనలు తెలిపారు.
స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందని జనసేనాని తెలిపారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో సోమవారం ఉదయం వరల్డ్ రికార్డు యూనియన్ అధికారులు ఆయన చేతికి ధృవపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి కృష్ణతేజ కూడా పాల్గొన్నారు.