Nandigam Suresh: సాంకేతిక ఆధారాలతో నందిగం సురేశ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

YCP leader Nandigam Suresh questioned by police in TDP office attack case
  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్ అరెస్ట్
  • పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే యత్నం
  • ఫొటోలు చూపించి ప్రశ్నించే సరికి పొంతనలేని సమాధానాలు
  • నేటి మధ్యాహ్నం 12 గంటలతో ముగియనున్న పోలీస్ కస్టడీ
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయనను విచారిస్తున్నారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పకుండా తప్పించుకున్నట్టు తెలిసింది. దీంతో సాంకేతిక ఆధారాలను చూపించి ప్రశ్నించడంతో తప్పించుకోలేకపోయారు. 

టీడీపీ కార్యాలయంపై దాడి సమయంలో తాను అక్కడ లేనని, తొలుత చెప్పిన సురేశ్ సాంకేతిక ఆధారాలు చూపడంతో నీళ్లు నమిలారు. తాను అటువైపు నుంచి వెళ్తుంటే అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టు అనిపించి అక్కడికి వెళ్లానని చెప్పుకొచ్చారు. దీంతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో ఉన్న ఫొటోలు చూపించి.. టీడీపీ ఆఫీసుపై దాడి కోసం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే బయల్దేరారు కదా.. అని ప్రశ్నించగా, తాను ఆ రోజు వేరే మార్గంలో వచ్చానని, ఆ తర్వాతే వైసీపీ ఆఫీసులో అప్పిరెడ్డిని కలిశానంటూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు ఆయన గన్‌మెన్ నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని ఆయన ముందు పెట్టడంతో మరోమారు నీళ్లు నమిలారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ముగియనుంది. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు.
Nandigam Suresh
YSRCP
TDP Office Attack
Amaravati

More Telugu News