Bizarre Prank Video: పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. రీల్స్ కోసం నడిరోడ్డుపై శవంలా..!
- యూపీలోని కస్గంజ్ జిల్లాలో ఘటన
- నడిరోడ్డుపై శవంలా పడుకున్న ముకేశ్ కుమార్ అనే యువకుడు
- వీడియో తీయడం పూర్తయిన తర్వాత పగలబడి నవ్వుతూ ఒక్కసారిగా లేచి కూర్చున్న ముకేశ్
- ఈ ఘటన కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
- ముకేశ్, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్‌గా మారాలని కొందరు చేస్తున్న వింత పనులు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఇదే కోవలో ఉత్తరప్రదేశ్‌లో ఒక ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి ఇన్‌స్టా రీల్స్ పిచ్చి పీక్స్‌కి వెళ్లింది. ఎంతలా అంటే.. నడిరోడ్డుపై శవంలా పడుకునేంతలా! అలా అతడు నడిరోడ్డుపై శవంలా పడుకుంటే.. అతని స్నేహితులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలనేది వారి ఐడియా. కానీ, చివరికి వారు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
యూపీలోని కస్గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సామాజిక మాధ్యమంలో పేరు తెచ్చుకోవడానికి 23 ఏళ్ల ముకేశ్ కుమార్ నడిరోడ్డుపై శవంలా పడుకున్నాడు. ఎర్రటి చాపపై పడుకుని ఉండగా, మెడలో దండ వేసి ఒంటిపై తెల్లటి గుడ్డ కప్పడం జరిగింది. ముకేశ్ ముక్కులో దూది కూడా పెట్టి అతడిని అచ్చం శవంలా నడిరోడ్డుపై ఉంచిన అతని స్నేహితులు ఇన్‌స్టాలో రీల్ కోసం దానిని వీడియో తీయడం ప్రారంభించారు.
ఇక వీడియో తీయడం ముగిసిన వెంటనే పగలబడి నవ్వుతూ ముకేశ్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దాంతో అప్పటివరకు నిజంగా యువకుడు చనిపోయాడని నమ్మిన అక్కడివారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
కాగా, ఈ ఘటన కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ముకేశ్ కుమార్, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నెట్టింట పలువురు విమర్శలతో విరుచుకుపడ్డారు. వ్యూస్, లైక్‌ల కోసం ఇలాంటి పిచ్చి పనులేంటి అని చురకలంటించారు.
'రీల్ చేసేవారు ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు' అని ఒకరు అంటే.. మరొకరు 'వ్యూస్ కోసం ప్రజలు ఇంత దిగజారిపోతారని నేను ఎప్పుడూ అనుకోలేదు' అని వ్యాఖ్యానించారు. అలాగే ఇంకోకరు 'ప్రపంచం అంతా విచిత్రమైన, వెర్రివాళ్లతో నిండి ఉంది, వారికి మంచి రీల్స్ చేయడానికి శిక్షణ ఇవ్వాలి' అని అన్నారు.
అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ రాజేష్ భారతి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్లోని రాజ్ కోల్డ్ స్టోరేజీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఓ వ్యక్తి శవంలా రోడ్డుపై పడుకుని వీడియో తీశాడు. అలా తన వీడియో ద్వారా అక్కడ కొంతసేపటి వరకు గందరగోళం సృష్టించాడు. దీనికి కారణమైన ముఖేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. అతనిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.