Harish Rao: చంద్రబాబు మొదటి రోజునే హామీ నిలబెట్టుకున్నారు... రేవంత్ రెడ్డి ఎందుకివ్వడం లేదు?: హరీశ్ రావు
- చంద్రబాబు మొదటి రోజునే పెన్షన్ రూ.4 వేలు చేశారన్న హరీశ్ రావు
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిందని విమర్శ
- కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేశారని వ్యాఖ్య
పక్కన ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.4 వేలు చేశారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. చంద్రబాబు పెన్షన్ పెంచినప్పటికీ మీరు ఎందుకు పెంచడం లేదో చెప్పాలని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
మెదక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందే అబద్ధాల పునాదుల మీద అన్నారు. అబద్దాలు చెప్పి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు, డిసెంబర్ 9 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చినప్పటికీ అవేవీ నెరవేరలేదన్నారు. తులం బంగారం, రూ.5 లక్షల భరోసా కార్డు, రూ.4 వేల పెన్షన్ ఏవీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు.
డిసెంబర్ 23న విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారని, రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇదే విషయాన్ని శ్వేతపత్రంలోనూ స్పష్టంగా పేర్కొన్నారన్నారు. శ్వేతపత్రంలోనే గవర్నమెంట్ హామీ లేనివి, ప్రభుత్వం కట్టనివి రూ.59,414 కోట్లు అని చెప్పారని గుర్తు చేశారు.
గవర్నమెంట్ హామీ ఉండి, గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి రూ.95,462 కోట్లు అని చెప్పారని తెలిపారు. అంటే ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని అప్పులు రూ.1,54,876 కోట్లుగా ఉందన్నారు.