Jeevan Reddy: రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక సూచన
- సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- రేషన్ కార్డుల జారీకి ఆదాయ పరిమితిని గ్రామాల్లోనూ పెంచాలని విజ్ఞప్తి
- గ్రామాల్లో పరిమితిని రూ.2 లక్షలుగా నిర్ధారించాలన్న జీవన్ రెడ్డి
తెలంగాణలో రేషన్ కార్డుల జారీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక సూచన చేశారు. బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన)గా ఉన్న కుటుంబాలకు ఆదాయ పరిమితిని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వ్యత్యాసం లేకుండా ఒకే విధంగా నిర్ధారించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆదాయ పరిమితిని ఎక్కడైనా రూ.2 లక్షలుగా నిర్ధారించాలని కోరారు.
ప్రస్తుతం బీపీఎల్ కుటుంబాలకు ఆదాయ పరిమితి గ్రామాల్లో రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలుగా ఉందని, కానీ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. గ్రామాల్లో ధరలు దాదాపు 10 శాతం అధికంగా ఉంటాయన్నారు. అందుకే బీపీఎల్ ఆదాయ పరిమితి నిర్ధారణ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతంలోనూ రూ.2 లక్షలుగా ఉండాలని సూచించారు.
రైతాంగం విషయానికి వస్తే, బీపీఎల్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 ఎకరాలను 5 ఎకరాలకు పెంచాలని కోరారు. రేషన్ కార్డులను నిరంతర ప్రక్రియగా జారీ చేయాలని ఆ లేఖలో కోరారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.