Revanth Reddy: ఆ చీప్ ట్రిక్స్ పనిచేయవు.. హైడ్రాను ఆపే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన రేవంత్రెడ్డి
- హైడ్రాపై ల్యాండ్ మాఫియా దుష్ప్రచారం చేస్తోందన్న రేవంత్రెడ్డి
- పేదలను బూచిగా చూపే చీప్ ట్రిక్స్ పనిచేయవని స్పష్టీకరణ
- నగరానికి లేక్సీటీ పేరును పునరుద్ధరిస్తామన్న సీఎం
- ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
హైడ్రాపై ల్యాండ్ మాఫియా దుష్ప్రచారం చేస్తోందని, అక్రమ భవనాలను కూలగొడుతుంటే పేదలను బూచిగా చూపిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ పనిచేయవని, హైడ్రా తనపని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు. నగరాన్ని రక్షించే విషయంలో వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వెనక ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం నగరాన్నిసంరక్షిస్తామని, నగరానికున్న లేక్సిటీ అన్న పేరును పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పదేళ్ల దుష్పరిపాలన కారణంగా నగరం వరద నగరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేరళ వరదలను గుర్తు చేసిన సీఎం.. హైదరాబాద్లో అలాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణను ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తున్నాం కాబట్టి నగరం క్లీన్ సిటీగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉందని రేవంత్రెడ్డి తెలిపారు. తాను గతంలో చెప్పినట్టు ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవంతోపాటు పర్యావరణ పునరుజ్జీవం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.