One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యం కాదు... కేంద్రంపై ఖర్గే, అసదుద్దీన్ విమర్శలు
- ఒకేసారి ఎన్నికల విధానం ఆచరణీయం కాదన్న మల్లికార్జున ఖర్గే
- ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని వ్యాఖ్య
- మోదీ, అమిత్ షాలకు మినహా ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదన్న ఎంఐఎం చీఫ్
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానం ఆచరణ సాధ్యంకాదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఖర్గే అభివర్ణించారు. ‘‘ఇది జరగదు. ఈ విధానాన్ని ప్రజలు ఆమోదించరు’’ అని ఆయన అన్నారు.
వచ్చే నెలలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదినకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రతిపాదిత ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్తో సహా మొత్తం 15 విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
మోదీ, అమిత్ షాలకు మాత్రమే అవసరం: అసదుద్దీన్
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా వ్యతిరేకించారు. సమస్యను సృష్టించడానికి 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' ఒక మార్గమని, అందుకే ఈ విధానాన్ని తాను స్థిరంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ప్రాథమిక అంశాలైన ఫెడరలిజం, ప్రజాస్వామ్యాలను ఈ విధానం నాశనం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మోదీ, అమిత్ షాలకు మినహా ఎవరికీ బహుళ ఎన్నికల విధానం సమస్య కాదని అన్నారు. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం వారికి ఉందని, అందుకే వారికి ఏకకాల ఎన్నికలు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో తరచుగా, నిర్దిష్ట కాలాలలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయని అసదుద్దీన్ ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.