Brain Surgery: జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేసిన ఏపీ ప్రభుత్వ వైద్యులు
- బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న మహిళ
- కాకినాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించిన వైనం
- అవేక్ క్రానియాటమీ నిర్వహించిన డాక్టర్లు
- అదుర్స్ సినిమా సీన్లను చూపిస్తూ శస్త్రచికిత్స
- రెండున్నర గంటల్లో విజయవంతంగా ఆపరేషన్ పూర్తి
ఏపీలోని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు ఓ రోగికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. అవేక్ క్రానియాటమీ అని పిలిచే ఈ శస్త్రచికిత్స ఎంతో క్లిష్టమైనది. సాధారణంగా మూర్ఛతో బాధపడే రోగులకు ఈ శస్త్రచికిత్స నిర్వహిస్తుంటారు. ఇటీవల కాలంలో ట్యూమర్లతో బాధపడేవారికి కూడా అవేక్ క్రానియాటమీ నిర్వహిస్తున్నారు.
ఈ శస్త్రచికిత్స సమయంలో రోగి మేల్కొని ఉండాల్సి ఉంటుంది. తద్వారా నాడీవ్యవస్థ చైతన్యవంతంగా ఉంటుంది... శస్త్రచికిత్స సులువు అవుతుంది.
55 ఏళ్ల అనంతలక్ష్మి అనే మహిళ కొన్నాళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ (మెదడులో కణితి)తో బాధపడుతోంది. అవయవాలు చచ్చుపడినట్టు ఉండడం, తరచుగా తలనొప్పితో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా... మెదడులో ఎడమవైపున 3.3×2.7 సెంటీమీటర్ల కణితి ఉన్నట్టు గుర్తించారు.
ఇలాంటి కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీగా ఖర్చవుతుంది. దాంతో అనంతలక్ష్మి కాకినాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించింది.
శస్త్రచికిత్స సమయంలో అనంతలక్ష్మి ప్రశాంతంగా ఉండేందుకు వైద్యులు ఆమెకు ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'అదుర్స్' లోని కొన్ని సీన్లను చూపించారు. శస్త్రచికిత్స చేసి విజయవంతంగా ఆమె మెదడు నుంచి కణితిని తొలగించారు. ఈ ఆపరేషన్ కు రెండున్నర గంటల సమయం పట్టింది.