AP Cabinet: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... కీలక నిర్ణయాలు ఇవిగో!
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ
- సమావేశం వివరాలను మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి
- వాలంటీర్ల కాలపరిమితి గతేడాదే ముగిసిందని వెల్లడి
- కానీ జగన్ వాలంటీర్ల సర్వీస్ ను పొడిగించలేదని ఆరోపణ
- చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలు, ఆమోదం తెలిపిన అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.
వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వ శాఖలతో సమీకృతం చేస్తూ ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 2.63 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, వారిలో 1.07 లక్షల మంది రాజీనామా చేశారని పార్థసారథి వివరించారు. పాలన అంతా వాలంటీర్ల మీదే నడుస్తోంది అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు.
వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారు, ప్రభుత్వ విజయానికి వారే ముఖ్య కారకులని కూడా చెప్పుకున్న గత ప్రభుత్వం... 2023 ఆగస్టు 15 తర్వాత వారి సేవలను పొడిగించకుండా ఎందుకు మోసం చేసిందన్నది అర్థంకాని విషయం అని పేర్కొన్నారు.
2023లోనే వాలంటీర్ల పదవీకాలం ముగిస్తే, ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. వాలంటీర్లు సర్వీస్ లో ఉన్నారో, లేదో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇలా వాలంటీర్లను మోసం చేయడానికి కారణాలేంటో కూడా గత ప్రభుత్వంలో ఉన్నవారే చెబితే బాగుంటుందని మంత్రి పార్థసారథి సూచించారు.
ఏదేమైనా గానీ సమగ్ర నివేదికతో రావాలని సంబంధిత శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, వాలంటీర్ల విషయంలో తమ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఇక, వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు చేసేందుకు ప్రతినెలా ఇస్తున్న రూ.200 రద్దు చేస్తున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. దినపత్రిక కొనుగోలుకు సంవత్సరానికి గత ప్రభుత్వంలో రూ.102 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. దినపత్రిక కొనుగోలుపై విచారణకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఇతర వివరాలు...
- ఇంటింటికి వెళ్లి 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన గురించి వివరించేలా కార్యాచరణ
- నూతన మద్యం విధానంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ
- అందుబాటులోకి నాణ్యమైన మద్యం బ్రాండ్లు... సగటు మద్యం ధర రూ.99గా నిర్ణయం
- భోగాపురం ఎయిర్ పోర్టు పేరును మార్చేందుకు క్యాబినెట్ నిర్ణయం
- ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ 'స్టెమీ' పథకం
- ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు
- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన
- రాష్ట్ర హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు... కార్పస్ ఫండ్ గా రూ.10 కోట్లు
- ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం
- రూ.1000 కోట్లతో రాష్ట్రంలో బిట్స్-పిలానీ విద్యాసంస్థ స్థాపనకు చర్యలు
- చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫారసు
- కౌలు కార్డుల నమూనా మార్చాలని క్యాబినెట్ నిర్ణయం. రైతు సంతకం అవసరం లేకుండానే కౌలు కార్డుల జారీ
- పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం
- మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం