Kadambari Kiran: రూ.98 లక్షలు పోగొట్టుకున్నాను... కాదంబరి కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- చానళ్లు డబ్బులు ఎగ్గొటాయన్న కాదంబరి కిరణ్
- వాచ్ మన్ కథ రాసి ఆపేశానని వెల్లడి
- మనం సైతం పుట్టింటి అలా అని వివరణ
కమెడియన్ గా వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన కాదంబరి కిరణ్ అందరికీ సుపరిచితమే. ఆయన నటుడు మాత్రమే కాదు రచయిత, దర్శకుడు కూడా. అయితే ప్రస్తుతం కిరణ్ సినిమాలు చేయడం లేదు. కానీ మనం సైతం ఫౌండేషన్ ద్వారా సినీ పరిశ్రమలోని వారికి తన వంతు సాయం చేస్తున్నారు.
తాజాగా కాదంబరి కిరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను అక్షరాల రూ.98 లక్షలు పోగొట్టుకున్నాను అని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
"నేను ఎన్నో సీరియల్స్ లో నటించాను. ఎన్నో సీరియల్స్ ఛానల్స్ వాళ్లు పని చేయించుకున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వలేదు. నాకు కేవలం 1 శాతం మంది మాత్రమే డబ్బులు ఇచ్చారు. 99 శాతం చానళ్లు డబ్బులు ఎగ్గొట్టాయి. ఒకరోజు కూర్చుని అన్ని లెక్కలు వేసుకుంటే రూ.98 లక్షలు రావాలి. అదంతా కేవలం నా రెమ్యూనరేషన్ మాత్రమే. ఆ డబ్బులు ఈ రోజుకు కూడా రాలేదు.
నేను ఎంతగానో కష్టపడ్డాను. రూ.150 నుంచి నా ప్రయాణాన్ని మొదలుపెట్టిన నేను అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. లెక్కలేనన్నిచోట్ల స్థలాలు కొన్నాను కానీ వాటినే మళ్లీ అమ్మేశాను. అప్పుడు నా మీద నాకే అసహ్యం పుట్టింది.
నేనొక వాచ్ మన్ ని ఈ ఇండస్ట్రీలో, గుడ్ అండ్ బాడ్ ఇన్సిడెంట్ అన్నీ అందరికీ తెలియచెప్పాలని అనుకున్నాను. తెలుగు పరిశ్రమ వాచ్ మన్ గురించి కథ రాయాలని అనుకున్నాను. 20 నుంచి 25 పేజీల వరకు రాశాను కానీ ఆ తర్వాత నాకే బాధనిపించింది. వాళ్లు నాకు తెలిసిన వాళ్లే, ఆ తరువాత వాళ్లే నాకు స్నేహితులు అయ్యారు. అందుకే వాచ్ మన్ కథను అక్కడితో ఆపేశాను.
మనం సైతం ఎలా పుట్టిందంటే... నా కష్టాలు నేను దాటి వచ్చిన తర్వాత నా బలం ఏంటో నేను తెలుసుకున్నాను. నా కుటుంబానికి నేను అండగా ఉండాలనుకున్నాను. నేను పేదవాడిగా ఎన్నో కష్టాలను అనుభవించాను. అందుకని పేదవాడికి సహాయం చేస్తే వారి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత భావం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలా నా కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్లాలని వచ్చిన ఆలోచన మనం సైతం.
చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం సైతం ముందుంటుంది. సాయం చేశాక నాకు వచ్చే ఆనందం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. 11 ఏళ్ళగా మనం సైతం ను నిర్వహిస్తున్నాను" అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.