Karate Kalyani: జానీ మాస్టర్ ను వదలొద్దు.. కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు
- డాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన మద్దతివ్వాల్సిన పనిలేదన్న నటి
- అత్యాచారం, మతమార్పిడికి ప్రయత్నం కచ్చితంగా లవ్ జిహాదేనని ఫైర్
- జానీ మాస్టర్ బాధితురాలికి అండగా నిలబడాలంటూ పిలుపు
జానీ మాస్టర్ కేసు ముమ్మాటికీ లవ్ జిహాదేనని నటి కరాటే కల్యాణి మండిపడ్డారు. డ్యాన్స్ మాస్టరో.. పక్క రాష్ట్రంలోని ఓ పార్టీ నేత అనో జానీ మాస్టర్ కు మద్దతుగా ఉండాల్సిన పనిలేదని ఆమె అన్నారు. ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన, మతం మార్చుకోవాలని వేధింపులకు గురిచేసిన జానీ మాస్టర్ ను వదలొద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.
జానీ మాస్టర్ పై నమోదైన అత్యాచార కేసుపై కరాటే కల్యాణి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. "కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా జానీ మాస్టర్ నిర్వాకంపైనే చర్చ జరుగుతోంది. హిందూ అమ్మాయిని ఆయన అత్యాచారం చేయబోయారు, చేశారు, ఆమెను హింసించారని అంటున్నారు. బాధితురాలిని మతం మార్చుకోవాలంటూ వేధింపులకు గురిచేశాడని చెబుతున్నారు. ఇది కచ్చితంగా లవ్ జిహాద్ కేసే.. జానీ మాస్టర్ ను వదలొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాను" అన్నారు.
జానీ మాస్టర్ చేతిలో వేధింపులకు గురైన అమ్మాయిని, ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని, న్యాయం జరిగే వరకూ ఆమెకు అండగా నిలబడాలని కరాటే కల్యాణి కోరారు. తాను కూడా ఆ అమ్మాయికి మద్దతుగా ఉంటానని చెప్పారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీ ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.