Revanth Reddy: రేవంత్ రెడ్డికి రూ.25 లక్షల చెక్కును అందించిన ఆదిశేషగిరిరావు
- ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరఫున చెక్కును అందించిన ఆదిశేషగిరిరావు
- రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన ఎమ్మెల్యే సాంబశివరావు
- రూ.10 కోట్ల భారీ విరాళం అందించిన సింగరేణి కాలరీస్
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈరోజు పలువురు ప్రముఖులు నగదు, చెక్కులు అందించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని వారు కలిసి విరాళం అందించారు.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్ సీసీ) తరఫున సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎఫ్ఎన్ సీసీ అధ్యక్షుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఇతర ప్రతినిధులు రూ.25 లక్షల విరాళాన్ని అందించారు. బాధితులకు సహాయం చేస్తున్నందుకు వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
వరద బాధితుల సహాయార్థం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2.50 లక్షల విరాళం అందించారు. వరద బాధితులకు అండగా ఉంటున్నందుకు కూనంనేనిని సీఎం అభినందించారు.
సింగరేణి కాలరీస్ సంస్థ భారీ విరాళం
వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు... సింగరేణి కాలరీస్ సంస్థ రూ.10 కోట్లకు పైగా విరాళాన్ని అందించింది. రూ.10,25,65,273 భారీ విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ, ఇతర ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు సచివాలయంలో సీఎంను కలిసి చెక్కును అందించారు.