Etela Rajender: అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రాను వాడుకుంటున్నారు: ఈటల

BJP MPs suggestion to Revanth Reddy on Hydra

  • హైడ్రాకు చట్టద్ధత కల్పించాలన్న ఈటల రాజేందర్
  • కేబినెట్‌లో చర్చించి హైడ్రాకు చట్టబద్ధత తీసుకు రావాలన్న ఎంపీ
  • మున్సిపాలిటీల్లోనూ హైడ్రాలాంటి వ్యవస్థ రావాలన్న రఘునందన్ రావు

చెరువులు, కుంటల రక్షణ లక్ష్యంగా పని చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈరోజు జనగామ జిల్లాలో పర్యటించిన ఈటల మాట్లాడుతూ... హైడ్రాకు ఇప్పటి వరకు ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు. అందుకే కేబినెట్‌లో చర్చించి హైడ్రాకు చట్టబద్ధత తీసుకు రావాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని, అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు. చెరువులు, వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలి: రఘునందన్ రావు


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో హైడ్రా వంటి వ్యవస్థను తీసుకు రావాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని అమీన్‌పూర్‌లో ప్రైవేటు సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ భూమిలో అపార్టుమెంట్ కట్టారని ఆరోపించారు. అందులో ఉంటున్న వారికి అధికారులు నోటీసులు ఇచ్చారని, కానీ అక్కడ నివసిస్తున్న వారు అమాయకులని అన్నారు. చాలామంది అమాయకులు ఇలా ఇళ్లను కొనుగోలు చేసి నష్టపోతున్నారని వాపోయారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక సంఘటనను చూపి కొత్త ప్రభుత్వంలో ఒకేసారి మార్పు జరగాలని కోరుకోవడం సరికాదన్నారు. తాము కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడం లేదని, సద్విమర్శలు ఉండాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆసుపత్రులను బ్రహ్మాండంగా చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేదన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఎంతమంది చనిపోయారు? ఎవరి హయంలో ఎంతమంది రైతులు చనిపోయరు? లెక్కలు తీయాలన్నారు.

  • Loading...

More Telugu News