Rajinikanth: రాజకీయ ప్రశ్న వేసిన విలేకరిపై రజనీకాంత్ అసహనం !
- చెన్నయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
- రాజకీయాలపై ప్రశ్నలు అడగొద్దని అసహనం
- వైరల్‌గా మారిన రజనీకాంత్ వీడియో
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. గతంలో ఈయన రాజకీయ రంగ ప్రవేశం వుంటుందని అందరూ ఊహించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన అభిమానులకు తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేట్టయాన్ చిత్రంతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న కూలీ చిత్రంలోనూ నటిస్తున్నారు. కేవలం సినిమాలు, ఆరోగ్యంపై దృష్టి సారించిన రజనీకాంత్ తాజాగా రాజకీయాలపై ఎదురైన ఓ ప్రశ్నకు విలేకరిపై మండిపడ్డాడు.
ఇటీవల చెన్నయ్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయ్‌నిధి స్టాలిన్ పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారంలో వుంది.. దీనిపై మీ కామెంట్ ఏమిటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా 'పాలిటిక్ప్‌కు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఇబ్బంది పెట్టొద్దని మీకు ఇంతకు ముందే చెప్పానుగా' అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రజనీకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో తిరుగుతోంది. డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ విషయంపై ఉదయనిధి స్టాలిన్ కూడా 'ఇది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం, దీనిపై ముఖ్యమంత్రి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు' అని స్పందించారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ప్రభుత్వంలో యూత్ వెల్పేర్, స్పోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్‌గా, డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.