Pawan Kalyan: సెప్టెంబర్ 23 నుంచి 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పవన్ కల్యాణ్
- విజయవాడలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ
- బ్యాలెన్స్ చిత్రీకరణను పూర్తిచేసుకున్న దర్శకుడు జ్యోతి కృష్ణ
- ఈ షెడ్యూల్‌తో దాదాపు చిత్రీకరణ పూర్తి
డిప్యూటీ సీఎంగా ప్రజా సేవలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరో వైపు తన సినిమాల చిత్రీకరణకు కూడా సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'హరి హర వీర మల్లు' మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఇంతకు ముందు పవన్‌కల్యాణ్ బిజీ షెడ్యూల్‌ను అర్థం చేసుకున్న నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఇతర సన్నివేశాల చిత్రీకరణ, చిత్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇక తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యతపై కూడా తనపై ఉందని భావించిన పవన్ కల్యాణ్... హరి హర వీర మల్లు మొదటి భాగం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
నిర్మాతలు సమయం వృథా కాకుండా విజయవాడలోనే వేసిన సెట్‌లో హరి హర వీర మల్లు షెడ్యూల్‌ను చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్కడ 'హరి హర వీర మల్లు' కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఇంతకు ముందు నిక్ పావెల్ బ్రేవ్‌హార్ట్', 'గ్లాడియేటర్', 'బోర్న్ ఐడెంటిటీ', 'ది లాస్ట్ సమురాయ్', 'రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్' వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు.
ఇక, క్రిష్ స్థానంలో దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో వున్నారు. ఈ విజయవాడ షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా తుదిదశకు చేరుకుంటుందని నిర్మాత ఏ.ఏం రత్నం తెలిపారు. పవన్ కల్యాణ్ ఓ యోధుడుగా నటిస్తున్న 'హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. త్వరలో విడుదల డేట్‌ను కూడా ప్రకటిస్తారని సమాచారం. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.