Kukkala Vidyasagar: ముంబయి నటి జెత్వానీ వ్యవహారంలో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
- వేరే రాష్ట్రంలో ఉన్న అతడి ఆచూకీ గుర్తించి అరెస్ట్
- స్నేహితుడి సెల్‌ఫోన్ వాడుతున్నట్టు సాంకేతికత సాయంతో గుర్తింపు
- చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులు
ముంబై నటి కాదంబరి జెత్వానీకి గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ (శుక్రవారం) వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వేరే రాష్ట్రంలో ఉన్న అతడిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
కాదంబరి జెత్వానీ కేసు పెట్టిన తర్వాత కుక్కల విద్యాసాగర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. తన స్నేహితుడి మొబైల్ ఫోన్‌ను వాడారు. అయితే సాంకేతికతను ఉపయోగించి అతడి జాడను పోలీసులు గుర్తించారు. అతడు ఉన్నచోటుకే వెళ్లి అరెస్ట్ చేశారు.
కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి కాదంబరి జెత్వానీపై కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఆమెను పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. దీంతో ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని జెత్వానీ ఈ మధ్యే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ కూడా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు గుర్తించారు. తప్పుడు ఆధారాలు సృష్టించడం, డాక్యుమెంట్ల ఫోర్జరీ, తప్పుడు రికార్డులను రూపొందించడంతో పాటుగా పలు ఆరోపణల వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. వీరితో పాటు మరికొందరి పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ కు గురికావడం ఈ కేసు ప్రాధాన్యతను తెలుపుతోంది.