Tirupati Laddu Row: సుప్రీంకోర్టుకు చేరిన తిరుపతి లడ్డూ వ్యవహారం... తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్

A letter petition seeking the urgent intervention of the Supreme Court into Tirumala laddus Row

  • సీజేఐ డీవై చంద్రచూడ్‌కి లెటర్ పిటిషన్ పంపించిన సత్యం సింగ్ అనే న్యాయవాది
  • నెయ్యిలో కొవ్వు హిందూ మతాచారాలను అతిక్రమించడమేనని వ్యాఖ్య
  • హిందువుల మత విశ్వాసాలపై దాడిగా పరిగణించి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించారనే వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. హిందూ మతాచారాలను అతిక్రమించిన ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టుకు ఓ లెటర్ పిటిషన్ అందింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌‌కి సత్యం సింగ్ అనే న్యాయవాది లేఖ రాశారు.

తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని వెల్లడి కావడంతో జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ అభ్యర్థించారు. ‘‘టీటీడీ ట్రస్ట్ గత మేనేజ్‌మెంట్ హయాంలో మాంసాహార ఉత్పత్తులను ‘ప్రసాదం' తయారీలో ఉపయోగించినట్టు ఇటీవలి పరిశీలనలో ఆందోళన కలిగించే నిజం బయటపడింది. ముఖ్యంగా పక్షి మాంసాన్ని (కోలిస్) వాడారు. ఈ చర్య హిందూ మతపరమైన ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించడమే కాకుండా మత విశ్వాసాలపై దాడి చేసినట్టు అవుతుంది. 

ప్రసాదం తయారీలో మాంసాహార ఉత్పత్తులను ఉపయోగించడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం రాజ్యాంగ పరిరక్షణపై దాడికి పాల్పడడమే. ఆర్టికల్ 25(1) ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది’’ అని న్యాయవాది సత్యం సింగ్ పేర్కొన్నారు.

ప్రసాదం తయారీ, పంపిణీ హిందూమత ఆచరణలో అంతర్భాగమని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో స్థిరపడిందని అన్నారు. పవిత్ర నైవేద్యాన్ని మాంసాహారంతో కలుషితం చేయడం ద్వారా భక్తుల హక్కులను ఆలయ నిర్వాహకులు తిరస్కరించినట్టేనని పేర్కొన్నారు.

ప్రభుత్వం నియమించిన అధికారుల పర్యవేక్షణలోనే తిరుమలలో ఉల్లంఘన జరిగిందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారం మన పవిత్ర సంస్థల నిర్వహణను వేధిస్తున్న ఒక పెద్ద సమస్యను ఎత్తిచూపుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News