Afghanistan: పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం.. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ కైవసం!
- షార్జా వేదికగా ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్
- సఫారీలను ఏకంగా 177 పరుగుల భారీ తేడాతో ఓడించిన ఆఫ్ఘనిస్థాన్
- మూడు వన్డేల సిరీస్ 2-0తో ఆఫ్ఘన్ కైవసం
- ప్రోటీస్ జట్టుపై మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయంతో పసికూన చరిత్ర
పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. బలమైన దక్షిణాఫ్రికాను ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా ప్రోటీస్ జట్టుపై మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్ఘన్ 2-0తో సిరీస్ విజేతగా నిలిచింది. ఐకానిక్ షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో సపారీలను ఏకంగా 177 పరుగుల భారీ తేడాతో ఓడించింది ఆఫ్ఘనిస్థాన్.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ శతకం (105) తో రాణించాడు. ఇది అతనికి ఏడో వన్డే సెంచరీ. అలాగే అజ్మతుల్లా ఒమర్జాయ్ 86, రహ్మత్ 50 అర్ధ శతకాలు నమోదు చేశారు. అజ్మతుల్లా 50 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగుల తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సఫారీలకు మంచి ఆరంభమే లభించింది. కెప్టెన్ టెంబా బావుమా ఓపెనర్ టోనీ డి జోర్జితో కలిసి 13.5 ఓవర్లలో 73 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కానీ, ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత ప్రోటీస్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు పారేసుకుంది. చివరికి 34.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ ఏకంగా 177 రన్స్ తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో బవుమా 38, జోర్జి 31, మార్క్రమ్ 21, హెండ్రిక్స్ 17 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడుగా ఖరోటే 4 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ ఐదు వికెట్ల ప్రదర్శన ఆఫ్ఘనిస్థాన్ చారిత్రాత్మక సిరీస్ విజయానికి దోహదపడింది.