Rinson Jose: లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లు.. వయనాడ్ వ్యక్తి కోసం నార్వే, బల్గేరియా, లెబనాన్ పోలీసుల వేట
- ఉన్నత చదువుల కోసం నార్వే వెళ్లిన రిన్స్ జోస్
- హిజ్బొల్లాకు అతడి కంపెనీయే పేజర్ల సరఫరా
- గత మూడు రోజులుగా అందుబాటులో లేకుండా పోయిన వైనం
- అతడు తప్పు చేసే రకం కాదంటున్న బంధువులు
లెబనాన్‌లో ఇటీవల ఒక్కసారిగా పేజర్లు పేలిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. ఒక్కసారిగా వేలాది పేజర్లు పేలడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్టు ఆరోపణులున్నాయి. ఈ నేపథ్యంలో నార్వే పౌరుడైన కేరళలోని వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్ పేరు బయటకు వచ్చింది. బల్గేరియాలో అతడికి ఓ కంపెనీ ఉంది. ఈ సంస్థే లెబనాన్‌లోని హిజ్బొల్లా గ్రూపునకు పేజర్లు సరఫరా చేసింది.
జోస్ వయసు 37 సంవత్సరాలు. అతడి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం డిజిటల్ రంగంలో అతడికి మంచి అనుభవం ఉంది. ఆటోమేషన్, మార్కెటింగ్, కృత్రిమ మేధ (ఏఐ)పై అభిరుచి ఉంది. పేజర్ల పేలుళ్ల వెనక అతడి పాత్రపై అనుమానంతో నార్వే, బల్గేరియా, లెబనాన్ పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు.
రిన్సన్ జోస్ ఎక్కడ?
ఉన్నత చదువుల కోసం నార్వే వెళ్లి డీఎన్ మీడియాలో డిజిటల్ కస్టమర్ సపోర్ట్‌లో జోస్ పనిచేశాడు. ప్రస్తుతం విదేశీ వర్క్ ట్రిప్‌లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఎవరికీ అందుబాటులో లేడు. దీంతో లండన్‌లో ఉన్న అతడి కవల సోదరులు సహా బంధువులు ఆందోళన చెందుతున్నారు. పేజర్ల పేలుళ్లతో అతడికి సంబంధం ఉండకపోవచ్చని వారు పేర్కొన్నారు. అతడి పేరు పొరపాటున తెరపైకి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. జోస్ భార్య ఓస్లో కూడా అందుబాటులో లేకపోవడంపై వారు మరింత ఆందోళన చెందుతున్నారు. అతడు చాలా ముక్కుసూటి మనిషని, అతడు తప్పు చేసి ఉండడని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘అతడితో మేం రోజూ ఫోన్లో మాట్లాడతాం. గత మూడు రోజులుగా మాత్రం ఫోన్లో జోస్ అందుబాటులో లేడు. అతడు ముక్కుసూటి మనిషి. అతడిపై పూర్తిగా నమ్మకం ఉంది. అతడు ఎలాంటి తప్పు చేయడు. అతడిని ట్రాప్ చేసి ఉండొచ్చు’’ అని 37 ఏళ్ల ఆయన బంధువు థంకచెన్ పేర్కొన్నారు.