Panda: 'చైనా'టకం.. కుక్కలకు రంగేసి పాండాలుగా చూపుతున్న డ్రాగన్ కంట్రీ జూ!
- వస్తువులనే కాదు జంతువులకూ నకిలీలను సృష్టిస్తున్న చైనా
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- తప్పు అంగీకరించిన డ్రాగన్ కంట్రీ
ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే కాదు ఏకంగా జంతువులను కూడా చైనా నకిలీ చేస్తోంది.. జంతు ప్రదర్శన శాలలో కుక్కలకు రంగులు అద్ది పాండాలుగా చూపిస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఆరోపణలు నిజమేనని చైనా అంగీకరించింది. పర్యాటకులను ఆకర్షించేందుకు తమ జూలో కుక్కలకు రంగులు వేసి పాండాలుగా చూపించామని అధికారులు చెప్పారు. అధికారుల వివరణపై జూ సందర్శకులు మండిపడుతున్నారు.
పాండాలు లేకుంటే అదే విషయం చెబితే సరిపోయేదని, ఇలా తమను మోసం చేయాలని చూడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తప్పుడు ప్రచారంతో తాము జూ సందర్శనకు వచ్చేలా చేశారని ఆరోపిస్తూ తమ నుంచి వసూలు చేసిన టికెట్ సొమ్మును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గత మే నెలలో తైఝౌ జూలోనూ ఇలాగే శునకాలకు రంగులు వేసి పాండాలుగా చూపించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
చైనాలోని ది షాన్ వెయ్ జూలో పాండాలను చూసేందుకు జనం ఇటీవల పోటెత్తారు. అరుదుగా కనిపించే ఈ జంతువులను తమ పిల్లలకు చూపించాలని తల్లిదండ్రులు జూకు క్యూకట్టారు. టికెట్ తీసుకుని లోపలకు అడుగుపెట్టిన సందర్శకులు బోనులో కనిపించిన పాండాలను చూసి నివ్వెరపోయారు. వాటి ప్రవర్తన కుక్కలను పోలి ఉండడంతో జాగ్రత్తగా పరిశీలించగా అవి నిజంగా శునకాలేనని బయటపడింది.
వాస్తవానికి జూలో పాండాలు లేవని, దీంతో పెంపుడు శునకాలకు రంగులు వేసి పాండాలుగా కనిపించేలా చేశారని గుర్తించారు. సదరు పాండాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు కాస్తా వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అవి పాం‘డాగ్’ లని కొందరు, పాండాల సరికొత్త వెర్షన్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.