Chandrababu: శ్రీవారి లడ్డూ వివాదంపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు
- తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ఏపీ సీఎం
- మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష
- సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు ఆదేశం
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశం చాలా సున్నితమైందని చెబుతూ.. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
ఈమేరకు శనివారం ఉదయం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో లడ్డు తయారీ అపవిత్రంగా మారిందని, తయారీ పక్రియలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై తాము సీరియస్ గా విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని భక్తులకు ఆయన హామీ ఇచ్చారు.