Ponguleti Srinivas Reddy: కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తాం: మంత్రి పొంగులేటి హెచ్చరిక
- రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
- రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని నిలదీత
- లేదంటే కేటీఆర్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్న
అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. అనవసర ఆరోపణలు చేసినందుకు గాను కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ... తాము రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే కేటీఆర్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు.
పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే టెండర్లను కట్టబెట్టిందన్నారు. టెండర్లను రూ.3,616 కోట్ల చొప్పున మూడు ప్యాకేజీలుగా పిలిచారని పొంగులేటి ఆరోపించారు. ఈ టెండర్లలో ఒక దానిని ఖమ్మంలో తనపై పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి కూడా దక్కించుకున్నారని తెలిపారు. టెండర్లు వేయవద్దని తాము ఎవరినీ బెదిరించలేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ పేరుతో రూ.39 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వీలైతే ప్రభుత్వానికి సూచనలు చేయాలని, సద్విమర్శలు చేయాలని కేటీఆర్‌కు హితవు పలికారు.