Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం: 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్న పవన్ కల్యాణ్
- రేపు నంబూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ దీక్ష ప్రారంభం
- 11 రోజుల తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం
- సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనన్న పవన్
విచ్చలవిడి మనస్తత్వం ఉన్నవాళ్లే తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడగలరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తిరుమల లడ్డూ అంశం ప్రజా పోరాటంలో ఉన్న తన దృష్టికి రాకపోవడం బాధ కలిగించిందని, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మనసు కలత చెందిందని తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి పట్ల ఇది నిజంగా ఘోర అపచారం అని, సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ దీనికి ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
గుంటూరు జిల్లా నంబూరులో కొలువై ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో రేపు (సెప్టెంబరు 22) దీక్ష ప్రారంభిస్తానని వెల్లడించారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగులు గత రాక్షస పాలకులకు భయపడి, తప్పిదాలపై మౌనంగా ఉండిపోయారా? అనిపిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు.