Chiranjeevi: చిరంజీవి గిన్నిస్ రికార్డుపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్పందన

Chandrababu and Revanth Reddy congratulates Megastar Chiranjeevi conferred with Guinness Record

  • 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ స్టెప్పులతో చిరంజీవి రికార్డు
  • భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఫలప్రదమైన హీరోగా ఘనత
  • సర్టిఫికెట్ ప్రదానం చేసిన గిన్నిస్ బుక్
  • మెగాస్టార్ పై విషెస్ వెల్లువ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అత్యధిక డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో చిరంజీవి 156 సినిమాల్లో నటించారు. 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేశారు. ఇవాళ హైదరాబాదులో ఆయనకు గిన్నిస్ బుక్ వారు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్పందించారు. 

"మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. నటుడిగా, డ్యాన్సర్ గా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సినీ తారగా చిరంజీవిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తించడం హర్షణీయం. తన ప్రతిభ, కళతో తెలుగు సినిమాకు అసమాన సేవలు అందించారు. ఇది చిరంజీవి కీర్తికిరీటంలో మరో కలికితురాయి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తుంది" అని ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. 

ప్రముఖ సినీ నటుడు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగిన విషయం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. 

చిరంజీవి గారిది అద్భుతమైన ప్రస్థానం: కేటీఆర్

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తొలి సినిమాతో అరంగేట్రం చేయడం నుంచి, అగ్రగామిగా నిలవడం వరకు చిరంజీవి గారిది ఎంత అద్భుతమైన ప్రస్థానం! అని అభివర్ణించారు. 

"సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబరు 22) 1978లో చిరంజీవి గారు చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు 46 ఏళ్ల తర్వాత భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఫలప్రదమైన హీరోగా ఆయన అసమాన ఘనతలను గుర్తించిన ప్రపంచం గిన్నిస్ బుక్ రికార్డుతో వేడుకగా జరుపుకుంటోంది. 156 సినిమాలు, 537 పాటలు, 24000 డ్యాన్స్ మూవ్ మెంట్స్, లెక్కలేనన్ని స్మృతులు... చిరంజీవి గారూ మీరు ఇప్పటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సినిమా కళకు సరైన నిర్వచనంలా, అనేక తరాల వారిని సమ్మోహనంలో ముంచెత్తుతూ తెలుగు  సినిమాకు గర్వకారణంలా నిలుస్తున్న మీకు శుభాభినందనలు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

లెజెండ్ కు సెల్యూట్ చేస్తున్నాం: బీఆర్ఎస్ పార్టీ

చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. లెజెండ్ సెల్యూట్ చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. "చిరంజీవి గారూ... గిన్నిస్ బుక్ రికార్డు స్థాపించిన మీకు అభినందనలు... 46  ఏళ్ల కెరీర్, 156 సినిమాలు, 537 పాటలు, 24000 డ్యాన్స్ స్టెప్పులు... అద్భుతమైన ఘనత... తెలుగు సినిమా గర్వించదగిన క్షణాలు" అంటూ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News