Venkat Akkineni: నాన్నగారు, ఎన్టీఆర్ గారి మధ్య విభేదాలు... నిజమే!: అక్కినేని వెంకట్
- నాన్నగారు మమ్మల్ని ఇండస్ట్రీకి దూరంగా వుంచారన్న వెంకట్
- అన్నపూర్ణ స్టూడియో కోసమే ఆయన ఎక్కువ ఆరాటపడ్డారని వెల్లడి
- రామారావుగారిని 'మా ఇంటి పెద్ద కొడుకు' అంటూ మా నాయనమ్మ గౌరవంగా చూసుకునేదన్న వెంకట్
అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరావుకి ఇద్దరు కొడుకులు.. ఇద్దరూ కూడా ఇండస్ట్రీలోనే ఎదిగారు. నాగార్జున హీరోగా అందరికీ సుపరిచితమే. ఇక రెండో కొడుకు అక్కినేని వెంకట్. ఆయన నిర్మాతగా తెరవెనుక ఉండడంతో చాలామందికి తెలియదు. నాగార్జునతో ఎక్కువ సినిమాలకు అక్కినేని వెంకట్ నిర్మాతగా వ్యవహరించడం తెలిసిందే. తాజాగా అక్కినేని వెంకట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగేశ్వరావు గారితో ఉన్న ఆయన అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
నాగార్జున మాత్రమే హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు, మీరు ఎప్పుడూ ట్రై చేయలేదా? అన్న ప్రశ్నకు వెంకట్ స్పందిస్తూ.. "వెలుగునీడలు సినిమాలో నాగార్జునతో పాటు నేను కూడా నటించాను. అనుకోకుండా ఆ సినిమాలో ఇద్దరం కనిపించాము. మా నాన్నగారు మమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. ఆయన ఎక్కువ చదువుకోలేదు. అందుకే ఆయన పిల్లలుగా మేము బాగా చదువుకోవాలని ఆశపడ్డారు. అలానే మేమిద్దరం బాగా చదువుకున్నాం. సినిమాలలోకి రావడానికి నాగార్జునకి చాలా ఇష్టంగా ఉండేది. అనుకోకుండా ఆయన సినిమాల్లోకి రావడం జరిగింది. నాన్నగారైతే ఎప్పుడూ సినిమాలలోకి రావాలని ఎవరినీ ప్రోద్బలం చేయలేదు" అని తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోలో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న తర్వాత మేము ప్రొడక్షన్ కోసం చాలా చోట్ల తిరిగాము. కానీ ఎవరు కూడా మేము సినిమాలు తీస్తామంటే నమ్మలేదు. నాగేశ్వరరావు గారి కొడుకులుగా మాకు మంచి గౌరవం ఉండేది. కానీ సినిమా తీయడానికి మాత్రం ఏ డైరెక్టర్ ముందుకు రాలేదు. ఇక అప్పుడే నిర్ణయించుకున్నాను. హీరో, డైరెక్టర్ ఇలా ఎంతమంది దగ్గరకని తిరుగుతాం...? హీరోగా నాగార్జుననే పెట్టి సినిమా తీయాలని, డైరెక్ట్ గా నాగార్జున దగ్గరికే వెళ్లి అడిగాను. నాగార్జున కూడా నాకు చాలా ఇష్టం సినిమాల్లో నటించడం, కచ్చితంగా చేస్తాను అని సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ విషయాన్ని మా నాన్న గారితో చెప్పడానికి మేం చాలా భయపడ్డాము. ఆయన నాగార్జునతో సినిమా అనగానే మొదట ఏమంటారో అనుకున్నాం కానీ, చివరికి ఆయన్ని ఒప్పించాము. మొదట్లో సినిమాలో నేను కూడా కనిపించాలని అందరూ అడిగారు. విక్రమ్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో కనిపించాను. తర్వాత విలన్ గా చేయమని నన్ను ఒక డైరెక్టర్ అడిగారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు" అని వెంకట్ వివరించారు.