Israel: హమాస్ చీఫ్ సిన్వర్ హతమంటూ ఇజ్రాయెల్ మీడియా కథనాలు
- చాలాకాలంగా లేని సిన్వర్ కదలికలు
- అతడు చనిపోయే ఉంటాడని అంటున్న ఇజ్రాయెల్ దళాలు
- అయితే, అందుకు సరైన ఆధారాలు లేవంటున్న అధికారులు
హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతి చెందాడా? ఆయనిప్పుడు సజీవంగా లేడా? ఈ ప్రశ్నలకు ఇజ్రాయెల్ అవుననే అంటోంది. చాలా కాలంగా అతడి కదలికలు లేకపోవడంతో అతడు మరణించే ఉంటాడని భావిస్తోంది. అయితే, అతడు మరణించాడని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. అక్టోబర్ 7 దాడుల రూపకర్త అయిన సిన్వర్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ మీడియా మాత్రం వార్తలు రాస్తోంది. ఈ కథనాలపై స్పందించిన మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ స్పందించారు. సిన్వర్ చనిపోయి ఉన్నా.. దానిని ధ్రువీకరించేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో గాజాపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడి చేస్తున్నాయి. సొరంగాల్లోకి చొచ్చుకెళ్లి హమాస్ ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. ఈ సొరంగాల్లోనే సిన్వర్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో అతడు గాయపడ్డాడా? లేదంటే ఉద్దేశపూర్వకంగానే అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడా? అన్న దానిపై ఇజ్రాయెల్ దళాలు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. అదే సమయంలో ఈ ప్రచారం ద్వారా హమాస్ దళాల స్థైర్యాన్ని దెబ్బతీసే ఎత్తుగానూ దీనిని భావిస్తున్నారు.