Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం.. పొన్నవోలు సుధాకర్ కీలక వ్యాఖ్యలు

Ponnavolu Sudhakar Reddy said that PIL has filed in supreme court requesting to find facts in Tirumala Laddu row
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌లోని వివరాలను ప్రముఖ అడ్వొకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

‘‘సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశాం. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు ఏంటి? ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి. ప్రచారంలో నిజం ఉంటే బయటకు రావాలి. నిజాలు బాహ్య ప్రపంచానికి తెలియాలంటే మీరు వేసుకున్న సిట్, లేక మీరు వేసుకున్న ఇన్వెస్టిగేషన్ కేసు సరికాదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని చెప్పిన తర్వాత... ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ పరిస్థితి దాటి వేరే విధంగా విచారణ చేస్తుందా? లేదా? అనేది ముఖ్యమైన ప్రశ్న. అందుకే గౌరవ సుప్రీంకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి, వారికి సహకరించడానికి ఫుడ్ టెక్నాలజీపై నిపుణులతో కమిటీ వేసి విచారణ చేయాలని కోరుతూ ఈ రోజు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. 

నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా? లేదా? జరగకపోతే ఈ దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అనే కోరుతూ సుబ్బారెడ్డి పిల్ వేశారు. వాస్తవాలు శ్రీవారి భక్తులకు, బాహ్య ప్రపంచానికి అర్థం కావాలనే ఉద్దేశ్యంతోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిల్ దాఖలైంది. విచారణకు ఎప్పుడు వస్తుందనేది తెలియదు. విచారణకు వచ్చిన రోజు వాదనలు వినిపిస్తాం’’ అని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.

హైకోర్టులో పిల్ వేయాలని తొలుత భావించామని సుధాకర్ రెడ్డి చెప్పారు. ‘‘గౌరవ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామని మొన్న అడిగాను. మీరు పిటిషన్ వేయండి... బుధవారం విచారణకు వస్తుందని ఆయన చెప్పారు. కానీ ఈ వ్యవహారం జనాలకు సంబంధించినది. రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం’’ అని తెలిపారు.

‘‘ఏఆర్ ఫుడ్ ట్యాంకర్లు సరఫరా చేసిన 10 ట్యాంకర్లలో 14 రకాల పరీక్షలు చేయగా 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. కల్తీ జరిగిందని గుర్తించిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపించామని అన్నారు. మళ్లీ ఆయనే మా దగ్గర కల్తీని నిర్ధారించే టెస్టింగ్ ల్యాబ్ లేదన్నారు’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Tirumala Laddu Row
Tirumala Laddu
Ponnavolu Sudhakar Reddy
Supreme Court

More Telugu News