Bhumana Karunakar Reddy: తప్పు చేసి ఉంటే నేను, నా కుటుంబం నాశనం అయిపోవాలి... తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం
- పుష్కరిణిలో స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేసిన భూమన
- తాను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదన్న భూమన
- గత కొన్ని రోజులుగా కలత చెందుతున్నానంటూ వ్యాఖ్య
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వాడారనే వ్యవహారం ఏపీలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. గత పాలకులు కల్తీ నెయ్యి వాడి దోపీడీకి పాల్పడ్డారంటూ కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తిరుమలలో శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు.
‘‘నేను గాని అపరాధం చేసి ఉంటే నాతో పాటు నా కుటుంబం కూడా సర్వ నాశనం అయిపోవాలి. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు" అని చెబుతూ... గోవిందా.. గోవిందా అని ఆయన ప్రమాణం చేశారు.
శరణాగతి తండ్రీ... గత కొన్ని రోజులుగా నా మనసు కలత చెందుతోంది... కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డూ వ్యవహారం కళంకితమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధమని, అపచారమని పేర్కొన్నారు.
కాగా ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణిలో భూమన కరుణాకర్ రెడ్డి స్నానం చేశారు. అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామివారికి మొక్కారు.
తిరుపతికి తరలింపు!
ప్రమాణం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు తిరుపతి తరలించారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన వాహనంలోనే తిరుపతికి పంపించారు.