Monty Panesar: అశ్విన్, నాథన్ లైయన్ లలో ఎవరు గొప్ప?... పనేసర్ ఆసక్తికర జవాబు
- టెస్టుల్లో 37వ సారి ఐదు వికెట్ల ఫీట్‌తో చరిత్ర సృష్టించిన అశ్విన్
- సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు వికెట్లు తీసిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డ్
- ఒకవేళ అశ్విన్ ఇంగ్లండ్ తరఫున ఆడి ఉంటే ఇప్పటికే వీడ్కోలు పలికేవాడన్న పనేసర్
- తన దృష్టిలో లైయన్ గొప్ప స్పిన్నర్ అన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
- అశ్విన్ స్వదేశంలోనే బెస్ట్ బౌలర్ అని వ్యాఖ్య
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 37వ సారి ఐదు వికెట్ల ఫీట్‌తో దివంగత ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ రికార్డును సమయం చేసిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అలాగే మరో రికార్డును కూడా ఈ ఫిఫర్ ద్వారా అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు వికెట్లు తీసిన అతిపెద్ద వయస్కుడిగా (38 ఏళ్ల 2 రోజులు) రికార్డుకెక్కాడు.
అయితే, తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్.. అశ్విన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అశ్విన్ ఇంగ్లండ్ తరఫున ఆడి ఉంటే ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి ఉండేవాడని పనేసర్ పేర్కొన్నాడు. తప్పకుండా అతడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వీడ్కోలు పలకాల్సిందిగా కోరేదని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ సెలెక్టర్లు యువ ఆటగాళ్లను ఆడించేందుకు ప్రాధాన్యం ఇస్తారని, ఇందులో భాగంగా ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటారని తెలిపాడు.
ఈ సందర్భంగా పనేసర్ తనకు ఎదురైన వర్తమాన స్పిన్నర్లు నాథన్ లైయన్, అశ్విన్‌లలో ఎవరు గొప్ప? అనే ప్రశ్నకు కూడా అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
పనేసర్ మాట్లాడుతూ.. "నా దృష్టిలో లైయన్ గొప్ప స్పిన్నర్. అటు అశ్విన్ స్వదేశంలోనే బెస్ట్ బౌలర్. బౌలింగ్ చేసేటప్పుడు కూడా తానొక బ్యాటర్ అని అశ్విన్ అనుకుంటాడు. అయితే అశ్విన్ గొప్పదనం ఏంటంటే.. అతడు ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత తెలివిగా బౌలింగ్ చేసి వాళ్లను బోల్తా కొట్టిస్తుంటాడు. ఇంకా చెప్పాంటే బ్యాటర్ల మైండ్‌సెట్‌ను చదవడంలో అశ్విన్ దిట్ట. అదే సమయంలో లైయన్ కంటే అతడికి మ్యాచ్ అవగాహన కూడా చాలా ఎక్కువ" అని పనేసర్ అన్నాడు.
ఇదిలాఉంటే.. ప్రస్తుత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2024-25లో ఆసీస్ స్పిన్నర్ కంటే అశ్విన్ ముందున్నాడు. అశ్విన్ ఇప్పటివరకూ 11సార్లు ఐదు వికెట్లు తీస్తే.. లైయన్ 10 సార్లు మాత్రమే ఈ ప్రదర్శన చేశాడు.