Israel: లెబనాన్ లో 500 మందిని మట్టుబెట్టిన తర్వాత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని సందేశం
- హిజ్బుల్లా తీవ్రవాదులకు మానవ కవచాలుగా మారొద్దని కోరిన నెతన్యాహు
- తాము యుద్ధం చేసేది లెబనాన్ ప్రజలతో కాదన్న ప్రధాని
- మీ ఇళ్లల్లో దాచిన రాకెట్లు ఇజ్రాయెల్ లో విధ్వంసం సృష్టిస్తున్నాయని వ్యాఖ్య
లెబనాన్ లోని హిజ్బుల్లా తీవ్రవాదుల స్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ దాడులలో దాదాపు 500 మందికి పైగా చనిపోయారని లెబనాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ‘ఆపరేషన్ నార్తర్న్ యారోస్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో లెబనాన్ భూభాగంపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు మొత్తంగా 492 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 35 మంది చిన్నారులు, 58 మహిళలు కూడా ఉన్నారని పేర్కొంది.
ఈ క్రమంలోనే లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నది లెబనాన్ ప్రజలతో కాదని ఈ సందేశంలో ఆయన స్పష్టం చేశారు. చాలాకాలంగా హిజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారని గుర్తుచేశారు. కాగా, దాడులు మొదలుపెట్టక ముందే లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లకుంటే 80 వేల మంది వరకు చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
నెతన్యాహు సందేశం సారాంశం..
‘హిజ్బుల్లా తీవ్రవాదులు మిమ్మల్ని (లెబనాన్ ప్రజలు) మానవ కవచాలుగా వాడుకుంటున్నారు. మీ లివింగ్ రూములలో రాకెట్లు పెట్టారు. మీ గ్యారేజ్ లలో మిస్సైళ్లను దాచారు. ఆ రాకెట్లు, మిస్సైళ్లు నేరుగా ఇజ్రాయెల్ లోని పౌరుల ఇళ్లపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. మా పిల్లాపాపలను కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మేం మా ఆయుధాలను బయటకు తీయాల్సి వచ్చింది. హిజ్బుల్లా తీవ్రవాదులు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి మీ ప్రాణాలను అడ్డుగా పెట్టుకుంటున్నారు. దయచేసి ఈ విషయంలో వారికి ఎలాంటి సాయం చేయొద్దు. మీ మీ ఇళ్ల నుంచి దూరంగా వెళ్లిపోండి. మీవి, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి. మా ఆపరేషన్ పూర్తయ్యాక మళ్లీ తిరిగి రావొచ్చు. అంతేకాని అక్కడే ఉండి హిజ్బుల్లా తీవ్రవాదులకు మానవ కవచాలుగా మారొద్దు’ అంటూ లెబనాన్ ప్రజలకు నెతన్యాహు విజ్ఞప్తి చేశారు.