Koratala shiva: అల్లు అర్జున్‌తో చేయాలనుకున్న కథ 'దేవర' కాదు: దర్శకుడు కొరటాల శివ ఇంటర్వ్యూ
- ఈ నెల 27న వస్తున్న ఎన్టీఆర్ దేవర
- దేవర రెండో పార్ట్ కోసం ఎదురుచూస్తారన్న కొరటాల
- ముగింపు అదిరిపోతుందని సంకేతలు
- హాండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టానని స్పష్టీకరణ
- చిరంజీవి గారు మేసేజ్ పెట్టారని వెల్లడి
ఇంతకు ముందు ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కొరటాల శివ తాజాగా ఎన్టీఆర్‌తో 'దేవర' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రూటెడ్ స్టోరీతో, మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కొరటాల శివ 'దేవర' గురించి చెప్పిన విశేషాలు
దేవర విషయంలో కాన్ఫిడెంట్‌గా వున్నారా? లేక ఏదైనా ఒత్తిడి వుందా?
కొరటాల: మంచి క్వాలిటీ ప్రొడక్ట్‌ను తయారుచేశాం. తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఒత్తిడి కంటే ఈ సినిమా విషయంలో బాధ్యతగా అనిపిస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగింది? తరువాత కథలో ఏమైనా మార్పులు చేశారా?
కొరటాల: ఆర్‌ఆర్‌ఆర్‌కు ముందు కూడా ఎన్టీఆర్ ఇమేజ్ తక్కువేమీ కాదు. ఆయనతో సినిమా అనగానే ఎలాగూ పెద్ద కథే రాస్తాం. నాకు తెలిసి ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో ముందుంటారు. ముందు నుంచే దేవర బిగ్గెస్ట్ మాస్ ఫిలిం.
ఆచార్య నిరాశపరిచిన తరువాత ఎన్టీఆర్ మీకు ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఎలా వుంది?
కొరటాల: ఎన్టీఆర్ నాకు చాలా మంచి మిత్రుడు. నాకు సోదరుడితో సమానం. కథలను, స్క్రిప్ట్‌లను నమ్మే హీరో అతను. ఇతర హీరోలతో చేసే సినిమా కథలను కూడా నేను ఎన్టీఆర్‌తో డిస్కస్ చేస్తాను. నా వరకు అతని దగ్గర ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఈ సినిమా విషయంలో నిజాయతీగా నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పనిచేశా.
దర్శకుడు రాజమౌళిలా మీరు దేవరకు ఎగ్రెసివ్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ఎందుకు చేయడం లేదు?
కొరటాల: నాకు అంతగా మార్కెటింగ్ తెలియదు. ఈ విషయంలో నేను చాలా వీక్. సినిమాల మార్కెటింగ్ అంతా నా నిర్మాత చూసుకుంటాడు.
ఆచార్య తరువాత చిరంజీవితో మీకున్న అనుబంధం ఎలా వుంది?
కొరటాల: దేవర ట్రైలర్ చూసిన వెంటనే చిరంజీవి గారు నువ్వు తప్పకుండా మళ్లీ సూపర్‌హిట్ కొడతావు అని నాకు మేసేజ్ పెట్టారు. అనవసరంగా కొంత మంది ఆయన నన్ను ఏదో అన్నారని హైలైట్ చేస్తున్నారు.
దేవర మొదటి పార్ట్ ఎండింగ్ ఎలా వుంటుంది?
కొరటాల: ఈ సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా అద్భుతంగా కుదిరాయి. దేవర ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో క్లిఫ్ హ్యాంగర్ (బలమైన సస్పెన్స్) ఉంటుంది. సెకండ్ పార్ట్‌కి లీడ్, సెకండ్ పార్ట్‌లో ఏముంటుందో అనే సస్పెన్స్ అయితే జనరేట్ అవుతుంది.
దేవర కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీనా? లేదా ఎక్కడి నుంచైనా ప్రేరణ పొంది రాసుకున్న కథ అనుకోవచ్చా?
కొరటాల: ఇది ఎక్కడా జరిగింది కాదు. ఎక్కడో చూసి ప్రేరణ పొంది రాసిన కథ కూడా కాదు.
ఈ కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా వుంది?
కొరటాల: ఎన్టీఆర్‌తో నాది ఎప్పుడూ స్పెషల్ జర్నీ. ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా వుంటుంది. కథ బాగుండకపోయినా ఆయన రియాక్షన్ అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈసినిమా కథ చెప్పగానే ఎంతో హై రెస్పాన్స్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే ఈ సినిమా చేశాను
అల్లు అర్జున్‌తో మీరు చెయ్యాలనుకున్న కథ ఇదేనా?
కొరటాల: ఆ కథ వేరు. దేవర ఓన్లీ ఫర్ ఎన్టీఆర్... ఇది ఎన్టీఆర్ కోసమే రాసుకున్న కథ
ఆచార్య ఫలితం నుంచి ఎలా బయటపడ్డారు?
కొరటాల: సినిమాలు అంటే సక్సెస్, ఫెయిల్యూర్స్ కామనే. మనం రెండూ ఒకేలా తీసుకోవాలి. ఇక ఆచార్య విడుదల తరువాత నేను వెంటనే లక్కీగా పనిలో పడిపోయాను. దేవర మోషన్ పోస్టర్ పనిలో ఉన్నాను. ఆచార్య విడుదలైన మూడో రోజే దేవర వర్క్‌లోకి వెళ్లిపోయాను.
దేవర రెండో పార్ట్‌ను ముందే ప్లాన్ చేసుకున్నారా?
కొరటాల: రెండో పార్ట్ తీయాలని ముందే అనుకున్నాం. ఈ కథను నేను నాలుగు గంటలు నేరేషన్ చెప్పాను. అంటే ఆన్ పేపర్ దీని పరిధి ఇంకా పెద్దగా ఉంటుంది. ఇక దేవర సెకండ్ షెడ్యూల్ సమయంలోనే రెండో పార్ట్ తీయాలనుకున్నాం. ఎందుకంటే ఒక పార్ట్‌లో కథ మొత్తం చెప్పడం కుదరదు అని తెలిసిపోయినప్పుడు అందరం కలిసి అనుకున్నాం. రెండు పార్టులుగా తీయాలనుకున్నది సెన్సేషన్ కోసమో, బిజినెస్ కోసమో కాదు.
మీ దర్శకత్వంలో రాబోతున్న మొదటి పాన్ ఇండియా చిత్రం దేవర. కథ విషయంలో ఇది అందరికి కనెక్ట్ అవ్వాలనే నిబంధన ఏమైనా పెట్టుకున్నారా?
కొరటాల: ఇంతకు ముందు సినిమాలకు ఎంత కష్టపడ్డానో ఈ సినిమాకు అంతే కష్టపడ్డాను. కాకపోతే ఈ సినిమా కోసం కాస్త పెద్ద కథ రాశాను అంతే. పాన్ ఇండియా కథ అని ప్రత్యేకంగా మైండ్‌లో ఏమీ పెట్టుకోలేదు.